Joint Pains: చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా.. పాటించాల్సిన ఆరోగ్య, ఆహార నియమాలివీ
- By Hashtag U Published Date - 07:00 AM, Wed - 24 August 22
గతంలో 60 ఏళ్లు దాటిన తర్వాత కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టేవి. కానీ ఈరోజుల్లో చిన్న వయసు వారిలో కూడా ఈ సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ సమస్య ఉంటే.. లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. అసమతుల్య జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నవయసులోనే కీళ్లనొప్పుల సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి కారణం పోషకాహార లోపమే .. కనుక మన రోజువారీ జీవనశైలిలో కొన్ని ఆహార పదార్థాలను భాగంగా చేసుకోవాలి. ఏం తినాలి ? ఏం తినొద్దు ? అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంతకంటే ముందు యూరిక్ యాసిడ్ సమస్య గురించి తెలుసుకుందాం..
యూరిక్ యాసిడ్ సమస్య ఇలా వస్తుంది..
యూరిక్ యాసిడ్ పెరగడం అనేది ఈ మధ్య కాలంలో సర్వ సాధారణంగా మారింది. యూరిక్ యాసిడ్ పెరగడం అనేది ఆహారంలో ప్యూరిన్లను అధికంగా తీసుకోవడం వల్ల పెరిగే సమస్య. యూరిక్ యాసిడ్ ఏర్పడటం కొత్త విషయం కాదు. ఇది మనందరి శరీరంలో తయారవుతుంది. మూత్రపిండాలు దానిని ఫిల్టర్ చేసి శరీరం నుంచి సులభంగా తొలగిస్తాయి. మూత్రపిండాలు శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేయలేనప్పుడు సమస్యలు మొదలవుతాయి. యూరిక్ యాసిడ్ ఏర్పడినప్పుడు.. అది కీళ్ళు, కణజాలాలలో పేరుకుపోతుంది. ఇది గౌట్‌కు దారితీస్తుంది. గౌట్ అంటే కీళ్ల నొప్పులు జాయింట్లను జామ్ చేయడం మొదలవుతాయి. లేచి కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడతారు.యూరిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోయినప్పుడు.. అది స్ఫటికాల రూపంలో కీళ్లలో పేరుకుపోయి నొప్పిని కలిగిస్తుంది.
యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల శరీరంలోని కండరాలలో వాపు వస్తుంది. ఇది చీలమండ, నడుము, మెడ, మోకాలి మొదలైన కొన్ని భాగాలలో నొప్పిని కలిగిస్తుంది. ఆ తరువాత గౌట్, ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారి తీస్తుంది.
ఇవి తినొద్దు..
కీళ్ల నొప్పుల సమస్య తీవ్రం కాకూడదు అన్నా.. యూరిక్ యాసిడ్ సమస్య తీవ్రం కాకూడదు అన్నా మీరు కొన్ని ఫుడ్స్ ను దూరం పెట్టాలి. కొన్ని అలవాట్లకు గుడ్ బై చెప్పాలి.
* రెడ్ మీట్, బీఫ్, పోర్క్, లాంబ్ మీట్, సీ ఫుడ్ కు దూరంగా ఉండండి. వీటిని ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య పెరిగే ఛాన్స్ ఉంటుంది.
* గోరు చిక్కుడు, బీన్స్, పప్పులు, పాలకూర, మష్రూమ్ వంటి వాటిలోనూ ఫ్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా మోతాదులో తీసుకోకుండా జాగ్రత్త పడండి.
* మద్యం మానేయండి. మద్యం వల్ల శరీరంలో యూరిల్ యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి. ఫలితంగా కీళ్ల నొప్పుల సమస్య పెరుగుతుంది.
* అధిక బరువు ఉన్న వారికి భవిష్యత్ లో కీళ్ల నొప్పుల సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పటికే అధిక బరువు ఉన్నవాళ్లు.. భవిష్యత్ లో కీళ్ల నొప్పుల సమస్య రాకూడదు అంటే బరువును కొంత నియంత్రణ లో పెట్టుకునే దిశగా ఆరోగ్య, ఆహార నియమాలు పాటించాలి.
* బాగా మానసిక ఒత్తిడికి గురి కావద్దు. మానసిక ఒత్తిడికి గురైతే.. రక్తంలో యూరిక్ యాసిడ్ మోతాదు పెరుగుతుంది. ఫలితంగా కీళ్ల నొప్పుల సమస్య పెరిగే ముప్పు ఉంటుంది.
* ఎస్పిరిన్ : జ్వరం లేదా నొప్పికి సాధారణంగా ఉపయోగించే ఔషధం ఆస్పిరిన్. తలనొప్పి లేదా కాళ్లు/కీళ్లలో తేలికపాటి నొప్పి, కొన్నిసార్లు జ్వరాన్ని తగ్గించేందుకు వైద్యులు దీన్ని సిఫార్సు చేస్తారు. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని నివారించేందుకు కూడా వైద్యులు దీన్ని రాస్తారు. ఇది సాధారణంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో అమ్మరు. ఎస్పిరిన్ వల్ల రక్తంలో యూరిల్ యాసిడ్ లెవల్ పెరుగుతుంది. ఇది కీళ్ల నొప్పులను పెంచుతుంది.
* డీ హైడ్రేషన్ సమస్య వల్ల మనకు మూత్రం సరిగ్గా రాదు. ఫలితంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. ఇది కీళ్ల నొప్పుల సమస్యకు కారణం అవుతుంది. డీ హైడ్రేషన్ సమస్య రావద్దు అంటే.. నీళ్లు బాగా తాగండి.
ఇవి తినండి…
* పసుపు, పాలు: కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజూ పసుపు కలిపిన పాలను తీసుకోవడం మంచిది.
* బ్లూబెర్రీలు: బ్లూబెర్రీలలో కీళ్ల నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
* నారింజ పండు: నారింజ పండులో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
* పుచ్చకాయ: పుచ్చకాయలో యాంటీఇన్ఫ్లమేటరీ , కెరొటినాయిడ్ బీటా- క్రిప్టోసంతిన్ గుణాలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసి కీళ్లనొప్పులు, వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
* ద్రాక్ష: ప్రతిరోజూ ద్రాక్షను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ద్రాక్ష పండులో రెస్వేరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ నొప్పిలను తగ్గిస్తాయి.
* చేపలు: చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతాయి.
* రాగులు, జొన్నలు, సజ్జలు: రాగులు, జొన్నలు , సజ్జలు శరీరానికి శక్తినందించే మంచిగా పోషక పదార్థాలు. వీటిని తీసుకుంటే ఎముకలు దృఢంగా మారి కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Related News
Fitness : తిన్న తర్వాత మీకు నిద్ర వస్తోందా? అయితే.. ఇలా ప్రయత్నించండి..!
భోజనం చేసిన తర్వాత నిద్రపోవడం పనిలో మీ ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది.