Health Tips: షుగర్,బీపీ కంట్రోల్ లో ఉండాలా.. అయితే పరగడుపున ఈ ఫుడ్స్ తీసుకోవాల్సిందే!
ప్రస్తుతం ఎక్కువ మంది బాధపడుతున్న షుగర్, బీపీ వంటి సమస్యలు అదుపులో ఉండాలి అంటే పరగడుపున కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 02:30 PM, Thu - 3 April 25

ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో బీపీ షుగర్ సమస్య. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ రెండు రకాల సమస్యలు ఉన్నవారు తరచుగా మెడిసిన్స్ తీసుకోవాల్సిందే. లేదంటే ఎప్పటికప్పుడు పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి. బీపీ సమస్య ఉన్నవారు ఎప్పటికప్పుడు బీపీని అదుపులో ఉంచుకోవాలి. అలాగే షుగర్ సమస్య ఉన్నవారు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ గా ఉంచడానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ఎవరైనా వ్యక్తి రక్తంలో చక్కెర, రక్తపోటును నియంత్రించడంలో ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి.
ముఖ్యంగా ఫైబర్, కొవ్వు తీసిన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే సమతుల్య ఆహారం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందట. అంతేకాకుండా ఉప్పు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందట. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు, పానీయాలను ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం ద్వారా మధుమేహం, అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. మెంతుల నీరు మెంతులు శరీర వేడిని తగ్గించడానికి సహాయపడే అద్భుతమైన పదార్థం అని చెప్పాలి. మెంతుల విత్తనాలు మధుమేహాన్ని నియంత్రించడానికీ బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ మెంతుల విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటుందట. ఇది రక్తంలో చక్కెర గ్రహించబడటాన్ని నెమ్మదిస్తుందట. మెంతుల విత్తనాలను రాత్రిపూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున తీసుకోవాలట. టొమాటో, దానిమ్మ రసం, దానిమ్మ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా టొమాటోలో లైకోపీన్ ఉంటుంది. ఇది కొవ్వు, రక్తపోటును తగ్గించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. అదే సమయంలో దానిమ్మ శరీరంలో బ్లడ్ సర్కులేషన్ మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుందట. ఇలాంటి టొమాటో రసంతో దానిమ్మ రసం కలిపి ఉదయం పరగడుపున తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్, రక్తపోటు అదుపులో ఉంటాయట.
కాగా అవిసె గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి అధికంగా ఉంటాయి. అవిసె గింజలను ఉదయం తీసుకోవడం చాలా మంచిదట. ఈ గింజలు బ్లడ్ లో షుగర్ లెవల్, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయట. అవిసె గింజల్లోని అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదింపజేయడం ద్వారా రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుందట. ఇలాంటి అవిసె గింజలను మెత్తగా పొడి చేసి నీటిలో కలిపి ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడుపున తాగితే షుగర్, బీపీ అదుపులో ఉంటాయట.
అదేవిధంగా పసుపు అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న అద్భుతమైన సుగంధ ద్రవ్యం. పసుపు రక్తంలో చక్కెర,రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుందట. దీనికి కారణం పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం. పసుపు పొడిని నిమ్మరసంతో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, కాలేయం కూడా శుభ్రపడుతుందట.