Fact Check : తెలంగాణలోని ఆ ఆలయం నుంచి కాశీకి భూగర్భ మార్గం ?
వైరల్ అయిన వీడియో(Fact Check)లో.. ఒక భూగర్భ గుహలో పైనుంచి నీరు పడుతుండగా.. కొందరు వ్యక్తులు ఆ నీటి కింద నిలబడి ఉన్నారు.
- By Pasha Published Date - 07:33 PM, Wed - 12 March 25

Fact Checked By newsmeter
ప్రచారం : తెలంగాణలోని శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి ఆలయ గుండాలలో భూగర్భ మార్గం కనిపించి, అది కాశీకి వెళ్తుందని చెబుతున్నారు.
వాస్తవం : ఈ ప్రచారం తప్పు. వైరల్ వీడియోలో చూపిన భూగర్భ గుహ, జలపాతం అనేవి తెలంగాణకు సంబంధించినవి కావు.
నాగర్ కర్నూల్ జిల్లా గుండాల్ గ్రామంలోని శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి ఆలయ గుండాలలో 16 ఏళ్ల ఓమేష్ అనే విద్యార్థి మునిగి చనిపోయాడు. అతడి కోసం మూడు రోజుల పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించాయి. చివరకు క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటన జరిగిన తరువాత, ఆలయ గుండాలలోని నీటిని తీయగా, భూగర్భ మార్గం బయటపడిందని.. ఆ మార్గం నేరుగా ఉత్తరప్రదేశ్‌లోని కాశీ దాకా వెళ్తుందని చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
- వైరల్ అయిన వీడియో(Fact Check)లో.. ఒక భూగర్భ గుహలో పైనుంచి నీరు పడుతుండగా.. కొందరు వ్యక్తులు ఆ నీటి కింద నిలబడి ఉన్నారు.
- ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ, దిగువ ఎడమ మూలలో ఓ బాలుడు, ఆలయ ట్యాంక్ రక్షణ చర్యల ఫోటోను కూడా జత చేశారు. ఈ వీడియోపై తెలుగులో ‘‘బాబు దొరికింది ఇక్కడే. శివుడే అతడిని మెచ్చి గుండాల గుడి కింద భూమి లోపలికి తీసుకుపోయాడు. లోపల మొత్తం బంగారమే ఉందంట’’ అని రాసి ఉంది. (ఆర్కైవ్)
ఇంకొక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘గుండాల గ్రామంలో దక్షిణ కాశీగా పిలువబడే శివుని మహాగుండం నుంచి కాశీ వరకు ఈ కోనేరు మీదుగా సొరంగ మార్గం ఉంది. ఇది మన పూర్వీకుల నమ్మకం. ఇది నిజం’’ అని పేర్కొన్నారు.(ఆర్కైవ్)
ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలింది ?
- ఈ ప్రచారం తప్పు అని న్యూస్ మీటర్ గుర్తించింది. వైరల్ వీడియోలో చూపిన భూగర్భ మార్గం శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినది కాదు.
- వైరల్ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పురోహితుడు మాట్లాడుతూ కనిపించాడు. “ఈ ఆలయ గుండాలలోకి వచ్చే నీరు కాశీ నుంచి వస్తుందని ప్రజలు నమ్ముతారు. మహాశివరాత్రి సమయంలో దురదృష్టకర ఘటన జరిగింది’’ అని అతను చెప్పాడు. ఈ వీడియోలో ఆలయ ప్రాంగణం, భక్తుల క్యూ, ఆలయ గుండాలలో స్నానం చేస్తున్న దృశ్యాలు, రక్షణ చర్యల వివరాలు ఉన్నాయి. అయితే, చివర్లో భూగర్భ జలపాతం వీడియో అదనంగా జోడించబడింది.
- గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిశీలించగా.. ఆలయం గుండాల వీడియోలో కనిపించినవి ఒకేలా ఉన్నాయి. కానీ, భూగర్భ గుహ దృశ్యం మాత్రం భిన్నంగా ఉంది.
- సైన్స్ డిస్కవరీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 2025 ఫిబ్రవరి 1న ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో క్యాప్షన్‌లో ‘‘రూబీ ఫాల్స్, టెనెస్సీ, యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న ప్రకృతి అద్భుతం’’ అని రాశారు.
- @lowrange_outdoors అనే మరో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 2025 జనవరి 30న ఇదే వీడియోను పోస్ట్ చేశారు. దీనికి “భూమిపై అత్యంత మహిమాన్వితమైన ప్రదేశం!!” అని క్యాప్షన్ పెట్టారు.
ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా(@lowrange_outdoors) బయోలో ఇచ్చిన యూట్యూబ్ లింక్‌ను అనుసరిస్తే.. 2024 ఫిబ్రవరి 3న అప్‌లోడ్ చేసిన 20-నిమిషాల వీడియో కనిపించింది. ఈ వీడియోలో అదే భూగర్భ గుహ, జలపాతం ఉన్నాయి.
గూగుల్ మ్యాప్స్ ఆధారంగా పరిశీలించగా, ఆలయ గుండాలు, భూగర్భ గుహ వేర్వేరుగా ఉన్నాయని తేలింది.
మొత్తం మీద.. వైరల్ వీడియోలో చూపిన భూగర్భ మార్గం శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి ఆలయంలో బయటపడిందని చెప్పే ప్రచారం అసత్యమని వెల్లడైంది.