Fact Check: మోడీ చెప్తే.. పాకిస్తాన్ లేకుండా చేస్తానన్న ఇటలీ ప్రధాని
‘‘నా మిత్రుడు ఆమోదిస్తే పాకిస్తాన్ (Fact Check) ప్రపంచ పటంలో కనిపించకుండా చేస్తాను’’ అని
- By Pasha Published Date - 07:53 PM, Sun - 4 May 25

Fact Checked By factly
ప్రచారం : 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి అనుమతి లభిస్తే.. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తానని ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ అన్నారు అనే ప్రచారం జరిగింది.
వాస్తవం : ఈ విధమైన వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని మెలోనీ చేయలేదు. వైరల్ అవుతున్న క్లిప్ అనేది 2019లో ఐరోపా ఎన్నికల ప్రచారంలో మెలోనీ ప్రసంగించిన వీడియోలోనిది. ఈ క్లిప్‌లో ఆమె ప్రధాని మోడీ గురించి కానీ, పాకిస్తాన్ గురించి కానీ మాట్లాడలేదు. కాబట్టి ఈ పోస్టులో ఉన్న క్లెయిమ్ తప్పు.
‘‘నా మిత్రుడు ఆమోదిస్తే పాకిస్తాన్ (Fact Check) ప్రపంచ పటంలో కనిపించకుండా చేస్తాను’’ అని ఇటలీ ప్రధాని మెలోనీ చెప్పారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) చూడొచ్చు. అసలు ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం..

వాస్తవ తనిఖీలో గుర్తించిన అంశాలివీ..
ఈ ప్రచారానికి సంబంధించిన ఆర్కైవ్డ్ వర్షన్‌ను మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రచారం వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడానికి మేం కీవర్డ్స్‌ను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాం. పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారని మేం గుర్తించాం. అయితే.. ప్రధాని మోదీ అనుమతిస్తే, పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని మెలోని అన్నట్లుగా ట్వీట్ కానీ, వీడియో క్లిప్ కానీ మాకు కనిపించలేదు. ఈ వాదనకు రుజువుగా వార్తా కథనాలేవీ మాకు లభించలేదు.
Profondamente addolorata per l’attacco terroristico avvenuto oggi in India, che ha causato numerose vittime. L’Italia esprime vicinanza alle famiglie colpite, ai feriti, al Governo e a tutto il popolo indiano.
— Giorgia Meloni (@GiorgiaMeloni) April 22, 2025
కీ ఫ్రేమ్స్‌తో సెర్చ్ చేయగా..
వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో మేం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. తద్వారా ఈ వీడియో యొక్క అన్‌క్రాప్డ్ వర్షన్ మాకు యూట్యూబ్‌లో దొరికింది. వైరల్ వీడియోలోని దృశ్యాలు ఈ వీడియో యొక్క 00:13 మార్క్ దగ్గరి నుంచి సరిపోలడాన్ని మేం గుర్తించాం. ఈ వీడియోను 2019 ఏప్రిల్ 14న ‘Vista Agenzia Televisiva Nazionale’ అనే ఇటాలియన్ మీడియా సంస్థ తమ అధికారిక వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. దీని బట్టి ఈ వీడియోకు 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడితో ఎటువంటి సంబంధం లేదని మేం గుర్తించాం. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం.. 2019 ఏప్రిల్ 14న ట్యూరిన్‌లో జరిగిన Fratelli d’Italia(FDI) పార్టీ యొక్క 2019 ఐరోపా ఎన్నికల ప్రచార సభలో జార్జియా మెలోని ప్రసంగం చేశారు.
తన ప్రసంగాన్ని యూట్యూబ్‌లో ఉన్న ట్రాన్సలేట్ సదుపాయం ఉపయోగించి చూడగా, ఇందులో తను మాట్లాడుతూ ఫాబియో ఫాజీయో అనే వ్యక్తి పారిస్ రాజధాని అని అన్నాడని చెప్పారు. ఇలా అన్నందుకు తనని ఖండిస్తూ.. ఇటలీ రాజధాని రోమ్ అని మెలోని అన్నారు. అలాగే, యూరోపియన్ యూనియన్ రాజధానిగా రోమ్ నగరాన్ని పెట్టాలని తను ఐరోపాకు చెప్తానని ఈ ప్రసంగంలో మెలోని అన్నారు.
ఈ సభకు సంబంధించిన మరి కొన్ని వీడియోలను ‘Vista Agenzia Televisiva Nazionale’ వారు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు (ఇక్కడ, ఇక్కడ). అలాగే, ఈ ప్రసంగం పూర్తి వీడియో మాకు Fratelli d’Italia వారి అధికారిక వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్‌లో దొరికింది. ఈ ప్రసంగంలో తాను ఎక్కడా కూడా ప్రధాని మోడీ గురించి కానీ, పాకిస్తాన్ గురించి కానీ మాట్లాడలేదు.
ఇదే విషయంపై 2019లో ‘today’ అనే ఇటాలియన్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ‘Globe Eye News’ అనే వార్తా సంస్థ ఈ వీడియో క్లిప్‌ను ‘X’లో పోస్ట్ చేస్తూ, యూరోపియన్ యూనియన్ రాజధానిగా రోమ్ ఉండాలని మెలోనీ అన్నారని పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ 14న ట్యూరిన్‌లో జరిగిన Fratelli d’Italia(FDI) పార్టీ ఎన్నికల ప్రచార సభ గురించి ప్రచురితమైన కొన్ని వార్తా కథనాలను మీరు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ప్రధాని మోడీ ఆమోదిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న వార్తలన్నీ తప్పులే.