Lord Shiva : శివుడికి మూడో కన్ను ఎందుకు? దాని వెనుక దాగి ఉన్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి?.. తెలుసుకుందాం!
ఒకసారి పరమశివుడు తన సహజ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, పార్వతీదేవి సరదాగా వెనుక నుంచి వచ్చి ఆయన రెండు కళ్లను మూసింది. శివుని నేత్రాలు సూర్యచంద్రులు అని పూర్వదెవతలు పేర్కొన్నారు. కనుక ఆ కళ్ల మూతతో ప్రపంచం చీకటిలో మునిగిపోయింది.
- By Latha Suma Published Date - 08:00 AM, Tue - 22 July 25

Shiva : శివుడికి లభ్యమైన ఒక అద్భుత లక్షణం మూడోకన్ను. ఈ మహిమాన్విత నేత్రం పరమశివుడికి మాత్రమే చిహ్నంగా ఉంటుంది. అందుకే ఆయనను ముక్కంటి, త్రినేత్రుడు, ఫాలోచనుడు అని పిలుస్తారు. అయితే శివుడికి ఈ అసాధారణమైన నేత్రం ఎందుకు? దాని వెనుక గల రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి. ఈ మూడోకన్ను ఓ సాధారణ కంటి కాదని తెలిసిన తర్వాతే ఈ సందేహాలన్నీ తీరతాయి.
మూడోకన్ను ఎలా ఏర్పడింది?
ఒకసారి పరమశివుడు తన సహజ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, పార్వతీదేవి సరదాగా వెనుక నుంచి వచ్చి ఆయన రెండు కళ్లను మూసింది. శివుని నేత్రాలు సూర్యచంద్రులు అని పూర్వదెవతలు పేర్కొన్నారు. కనుక ఆ కళ్ల మూతతో ప్రపంచం చీకటిలో మునిగిపోయింది. అప్పుడు శివుడు తన అంతర్గత శక్తిని కేంద్రీకరించి మూడవ నేత్రాన్ని తెరిచాడు. ఆ నేత్రం వెలుగుతో లోకాన్ని కాంతిమయంగా మార్చింది. అయితే ఈ నేత్రపు వేడికి పార్వతీదేవి చేతులకు పట్టిన స్వేదం నుంచి అంధకాసురుడు జన్మించాడనేది ఇంకొక కథ.
త్రినేత్రానికి గల రహస్య గాథ
ఇంకొక పురాణగాథ ప్రకారం, ఆదిపరాశక్తి త్రిమూర్తుల్ని సృష్టించి, వారిని సృష్టి-స్థితి-లయలకు సహకరించమంది. వారు నిరాకరించగా, పరాశక్తి ఆగ్రహంతో తన మూడోకన్ను తెరిచి వారిని భస్మం చేస్తానని హెచ్చరించింది. అప్పుడు మహేశ్వరుడు ఆ మూడోకన్నును తనకు అనుగ్రహించమని ప్రార్థించి పొందాడు. అనంతరం ఆ నేత్రంతో పరాశక్తినే భస్మం చేసి, ఆ భస్మాన్ని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మీ, సరస్వతి, పార్వతులుగా సృష్టించినట్లు చెప్పబడింది.
అగ్నినేత్రం, జ్ఞాననేత్రం
శివుని మూడోకన్ను సాధారణ కళ్లలా కాదు. ఇది అగ్నినేత్రం లేదా జ్ఞాననేత్రం. దీనికి ఉదాహరణ మన్మథుని కథ. దేవతల కోరిక మేరకు మన్మథుడు పూలబాణంతో శివుడి మనసులో ప్రేమోద్రేకాన్ని రేకెత్తించాలనుకున్నాడు. కానీ ఆ కల్లోలానికి మూలం తెలుసుకునేందుకు ప్రయత్నించిన శివుడు, తన మూడోకన్ను తెరిచి మన్మథుని బూడిద చేశాడు. ఇది కేవలం శారీరక దహనం కాదు. ఇది మనస్సులోని కోరికల్ని సంహరించే దివ్యశక్తి. ఇక్కడ మన్మథుడు అంటే ఒక్క వ్యక్తి కాదు. మనస్సు మథించే శక్తి అని భావించాలి. అంటే మనలో పుట్టే కోరికలు, ఆకాంక్షలు. శివుని మూడోకన్ను అంటే ఇంద్రియాల ఊహలతో కలిగే కలవరాన్ని దహించే జ్ఞానాగ్ని. ఇది తర్కం, విచక్షణ, వివేకంతో ఆ కోరిక అవసరమా, కాదు అనే అర్థాన్ని తెలుసుకునే దృష్టి. దాని ద్వారానే మన్మథుడు భస్మం అయ్యాడు. ఇది అంతరంగ శుద్ధి సంకేతం.
మూడోకన్ను — ఆజ్ఞాచక్రంలో నిక్షిప్తమైన జ్ఞానదృష్టి
యోగపరంగా చూస్తే మన శరీరంలో 72 వేల నాడులు, 114 ఎనర్జీ కేంద్రీకరణ బిందువులు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన ఏడు చక్రాలు. వాటిలో మూడోకన్ను ఉన్నది ఆజ్ఞా చక్రం వద్ద — భ్రూవధ్య మధ్యభాగంలో. యోగ సాధన ద్వారా ఆజ్ఞా చక్రాన్ని తాకినప్పుడు జ్ఞానోదయం జరుగుతుంది. అది తెరచినప్పుడు ప్రపంచాన్ని ఉన్నదిగా చూసే శక్తి వస్తుంది. అదే మూడోకన్ను. పరమశివుడు ఒక యోగపురుషుడు. తనలోని అన్ని కోరికల్ని జ్ఞాననేత్రం ద్వారానే భస్మం చేశాడు. ఆ భస్మమే ఆయన శరీరంపై రాసుకుంటాడు. అదొక గుర్తు మాత్రమే, తత్వాన్ని కాదు. మూడోకన్ను కలవారికి భౌతికతతో పని ఉండదు. అది మానసిక, ఆధ్యాత్మిక పరిణతి సూచకం. మన అందరిలోనూ ఆ దృష్టి ఉంది. తేడా ఏంటి అంటే… శివుడు దాన్ని తెరవడంలో సిద్ధహస్తుడు. మనం మాత్రం సాధనతో అక్కడికి చేరాల్సినవారు.
Read Also: Parliament Monsoon Sessions : సభలో ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారు : రాహుల్ గాంధీ