Krishna Janmashtami 2025 : శ్రీ కృష్ణాష్టమి రోజు దీపం ఎప్పుడు వెలిగించాలి?..ఏ దిక్కున వెలిగించాలంటే?
శ్రీకృష్ణుని జననం రోహిణి నక్షత్రం, అష్టమి తిథి, వృషభ లగ్నంలో అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అందువల్ల ఆగస్టు 16 అర్ధరాత్రి 12:05 నుంచి 12:51 మధ్య పూజ చేస్తే అత్యద్భుత ఫలితాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 07:30 AM, Sat - 16 August 25

Krishna Janmashtami 2025 : శ్రీకృష్ణ జన్మదినంగా పరిగణించబడే పవిత్ర శ్రీకృష్ణాష్టమి సందర్భంగా, భక్తులంతా ‘హరే కృష్ణ హరే రామ’ నామస్మరణతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, కృష్ణుని కృపకు పాత్రులవుతున్నారు. ఈ ఏడాది గోకులాష్టమి అంటే జన్మాష్టమి 2025, ఆగస్టు 16వ తేదీన జరగనుంది. అయితే, ఈ రోజు కృష్ణుని సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే ఓ ప్రత్యేక సమయంలో పూజ చేయాలనే సూచనలు జ్యోతిష్య నిపుణులు అందిస్తున్నారు. ప్రముఖ జ్యోతిష్య లు చెబుతున్నట్టు, శ్రీకృష్ణుని జననం రోహిణి నక్షత్రం, అష్టమి తిథి, వృషభ లగ్నంలో అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అందువల్ల ఆగస్టు 16 అర్ధరాత్రి 12:05 నుంచి 12:51 మధ్య పూజ చేస్తే అత్యద్భుత ఫలితాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. ఈ సమయంలో నిర్వహించే పూజలో ముఖ్య భాగంగా నిలిచేది శ్రీకృష్ణ దీపం. ఇది కేవలం దీపం మాత్రమే కాదు.. దివ్యమైన శక్తిని ఆహ్వానించే మార్గంగా పరిగణించబడుతుంది. దీన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వెలిగించాలో స్పష్టంగా తెలియజేశారు పండితులు.
శ్రీకృష్ణ దీపం ఎలా వెలిగించాలి?
వేళ: వీలైతే అర్ధరాత్రి పూజ సమయంలో వెలిగించాలి. అది సాధ్యం కాకపోతే ఉదయం వెలిగించవచ్చు.
స్థానం: ఇంట్లో ఉత్తర దిక్కులో దీపాన్ని వెలిగించాలి. పూజాగదిలో ఉత్తర దిక్కున శుభ్రంగా కడిగిన పీటపై పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, బియ్యపిండితో అష్టదళ పద్మ ముడ్గు వేసి, బాలకృష్ణుని ఫొటో పెట్టాలి.
దీపం తయారీ: మట్టి ప్రమీదలో ఆవు నెయ్యి పోసి, ఆరు వత్తులను కలిపి ఒక పెద్ద వత్తిగా చేసి, ఫొటో ముందు ఉత్తరదిశలో దీపం వెలిగించాలి.
పూజా విధానం ఎలా ఉండాలి?
రాత్రిపూట పూజ చేయలేని వారు ఉదయాన్నే పూజ చేయొచ్చు. పూజ సమయంలో తులసి దళాలు, నీలం పుష్పాలతో శ్రీకృష్ణుని అలంకరించాలి. అనంతరం
మంత్రోచ్ఛారణ: “ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు లేదా వీలైనన్ని సార్లు పఠించాలి.
నైవేద్యం: కృష్ణుడికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పటిక బెల్లం వంటి పదార్థాలను సమర్పించాలి.
ప్రార్థన: అనంతరం కృష్ణుని కృప కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించాలి.
ఇలాంటి పూజ ఫలితమేంటి?
జ్యోతిష నిపుణులు చెబుతున్నట్టు, ఈ విధంగా చేసిన పూజ జన్మజన్మల పాపాలను తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదించే శక్తి కలిగినదిగా భావించబడుతుంది. కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, ధనం వంటి సకల శుభాల కోసం శ్రీకృష్ణ దీపాన్ని వెలిగించడం ద్వారా కృష్ణుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.