టీటీడీ గుడ్ న్యూస్..శ్రీవారి ప్రోటోకాల్ దర్శనం..సేవలో తరించే ఛాన్స్, వెంటనే ఇలా చేయండి!
- Author : Vamsi Chowdary Korata
Date : 20-02-2026 - 10:39 IST
Published By : Hashtagu Telugu Desk
Tirumala Tirupati Devasthanams టీటీడీ శ్రీవారి వైద్య సేవ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. శ్రీవారి వైద్యసేవలో భాగంగా చికిత్స, బోధన, పరిశోధన రంగాల్లో ఎక్స్పర్ట్ డాక్టర్లను టీటీడీ ఆహ్వానిస్తోంది. నెలలో సగటున వారం రోజులపాటు ఆసుపత్రుల్లో సేవలు అందించొచ్చు. వీరికి ప్రోటోకాల్ శ్రీవారి దర్శనం, వసతి, భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు టీటీడీ అధికారులు.
- తిరముల శ్రీవారి వైద్య సేవకు అవకాశం
- నెలలో వారం పాటూ సేవలు చేయొచ్చు
- దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్న టీటీడీ
- ప్రోటోకాల్ దర్శనం, వసతి, ఫుడ్ ఫ్రీ
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో శ్రీవారి వైద్య సేవకులకు అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు డాక్టర్లు సేవాభావంతో టీటీడీ ఆస్పత్రులైన బర్డ్, స్విమ్స్ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నారు. అయితే దేశ, విదేశాల నుంచి కూడా డాక్టర్లతో పాటుగా నర్సులు, ఇతర అంశాలకు సంబంధించి టెక్నీషియన్ల సేవలను (రోగులకు అధునాతన శస్త్రచికిత్సలు, బోధన, పరిశోధనలు) కూడా టీటీడీ ఆహ్వనిస్తోంది. ఇలా వైద్య సేవ కోసం వచ్చే డాక్టర్లతో పాటుగా కుటుంబసభ్యులకు కూడా తిరుమల శ్రీవారి ప్రొటోకాల్ దర్శనం, వసతి, రవాణా వంటి సదుపాయాలను టీటీడీ సమకూర్చనుంది.
టీటీడీ వెబ్సైట్ ద్వారా శ్రీవారి వైద్యసేవకులుగా నమోదు చేసుకోవచ్చు.. అలాగే యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే డాక్టర్లు వారి అనుభవంతో పాటుగా అందుకున్న అవార్డులు, ఇతర అంశాలను వెల్లడించాల్సి ఉంటుంది. టెక్నీషియన్లు, నర్సులు కూడా ఎలాంటి సేవలు అందించగలరో చెప్పాల్సి ఉంటుంది. శ్రీవారి వైద్య సేవకులు నెలలో సగటున వారం వరకు సేవలు అందించొచ్చు. టీటీడీ ఇద్దరు ఉద్యోగులతో ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి.. శ్రీవారి వైద్య సేవకు సంబంధించిన అంశాలను చూసుకునేలా ప్లాన్ చేసింది. శ్రీవారి వైద్య సేవకు సంబంధించి మరిన్ని వివరాల కోసం మొబైల్ నంబరు 91542 16307, srivarivaidyasevasvims@gmail.com లో సంప్రదించాలని టీటీడీ సూచిస్తోంది. వైద్య సేవ కోసం వచ్చే దరఖాస్తుల్ని టీటీడీ ఆస్పత్రుల సీఈవోతో పాటుగా స్విమ్స్, బర్డ్ ఉన్నతాధికారులు పరిశీలిస్తారు. అనంతరం డాక్టర్లను సంప్రదించి సేవలు ఎప్పుడు అందించాలో తేదీలు ఖరారు చేస్తారు.
శ్రీవారి వైద్య సేవకుల కోసం టీటీడీ భూదేవి కాంప్లెక్స్‌లోని ఆఫీస్‌ను కేటాయించనుంది.. అక్కడి నుంచే అన్ని అంశాలను పర్యవేక్షించనున్నారు. వైద్య సేవ కోసం వచ్చే వారికి కోసం వేదిక్ వర్సిటీ, స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణాల్లో వసతి, రవాణా, మంచి భోజనాలు అందిస్తారు. స్పెషలిస్ట్ డాక్టర్లు వైద్య సేవ కోసం ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. సర్జరీలతో పాటుగా, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అంటున్నారు.
ఇప్పటికే టీటీడీ ఆస్పత్రులైన బర్డ్, స్విమ్స్ ఆస్పత్రుల్లో కొంతమంది డాక్టర్లు సేవలు అందించారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చి డాక్టర్లు స్విమ్స్ ఐసీయూను పరిశీలించి కోన్ని సూచనలు కూడా చేశారు. అలాగే హైదరాబాద్, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆస్పత్రులకు చెందిన డాక్టర్లు కూడా బర్డ్, స్విమ్స్‌లో వైద్య సేవ కోసం వస్తున్నారు. ప్రతి నెలా వీరు సేవలు అందిస్తున్నారు.. వీరికి ఉచితంగా వసతి, భోజనం వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. వీరు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. వైద్య సేవ కోసం డాక్టర్లు నమోదు చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.