ఆరోగ్యానికి ఆధారం సూర్యుడు..మన అనారోగ్యాలను ఎలా దూరం చేస్తాడు?
అందుకే మన పెద్దలు సూర్యుడిని “ఆరోగ్య ప్రదాత”గా కొలిచారు. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అనే సూక్తి వెనుక ఉన్న శాస్త్రీయ అర్థం ఇప్పుడు ఆధునిక వైద్య పరిశోధనల ద్వారా కూడా నిర్ధారితమవుతోంది.
- Author : Latha Suma
Date : 25-01-2026 - 4:30 IST
Published By : Hashtagu Telugu Desk
సూర్యకిరణాలు..విటమిన్ D కు మూలాధారం
సూర్యోపాసన ..మనసుకు, శరీరానికి శక్తి
ప్రాచీన సంప్రదాయాల్లో దాగిన వైద్య విజ్ఞానం
sun : ప్రపంచంలో ప్రతి జీవి జీవించడానికి అవసరమైన ప్రధాన శక్తి సూర్యుడు. కేవలం వెలుగు, వేడి మాత్రమే కాదు మన శరీరానికి కావలసిన అనేక ఆరోగ్య లాభాలను కూడా సూర్యుడు అందిస్తాడు. అందుకే మన పెద్దలు సూర్యుడిని “ఆరోగ్య ప్రదాత”గా కొలిచారు. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అనే సూక్తి వెనుక ఉన్న శాస్త్రీయ అర్థం ఇప్పుడు ఆధునిక వైద్య పరిశోధనల ద్వారా కూడా నిర్ధారితమవుతోంది. సూర్యకిరణాలు మన అనారోగ్యాలను ఎలా దూరం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యరశ్మి మన శరీరంపై పడినప్పుడు చర్మం ద్వారా విటమిన్ D ఉత్పత్తి అవుతుంది. ఈ విటమిన్ D ఎముకలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో రికెట్స్ వృద్ధుల్లో ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు దూరంగా ఉండాలంటే సూర్యకాంతి అవసరం.
అలాగే విటమిన్ D లోపం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు సూర్యస్నానం ద్వారా తగ్గుతాయి. రోజూ ఉదయం వేళ కొద్దిసేపు సూర్యకిరణాలను ఆస్వాదించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సూర్యునికి నమస్కరించడం కేవలం ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాదు అది శరీర–మనస్సులపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఆరోగ్య సాధన. సూర్య నమస్కారాలు చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంగా పనిచేస్తాయి. ఉదయపు సూర్యకాంతి మన మెదడులో సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. సూర్యోపాసనతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, జీవనోత్సాహం కలుగుతుంది.
మన భారతీయ సంప్రదాయాల్లో సంధ్యావందనం సూర్యారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుని ధ్యానించడం ద్వారా శరీరానికి కావలసిన సహజ శక్తిని పొందేవారు. ఈ ఆచారాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం సూర్యరశ్మిని సరైన సమయంలో స్వీకరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే. నేత్ర సంబంధిత సమస్యలు, హృదయ వ్యాధులు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు సూర్యకాంతి ద్వారా కొంతవరకు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, సూర్యుడు మన శరీర జీవ గడియారాన్ని సమతుల్యం చేస్తాడు. నిద్రలేమి, అలసట, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలకు కూడా సూర్యకాంతి సహజ పరిష్కారంగా పనిచేస్తుంది. సూర్యుడు కేవలం ఆకాశంలో వెలిగే గ్రహం కాదు మన ఆరోగ్యాన్ని కాపాడే నిత్య వైద్యుడు. ఆధునిక జీవనశైలిలో సూర్యుని దూరం చేసుకుంటున్న మనం తిరిగి ప్రకృతితో మమేకమవాల్సిన అవసరం ఉంది. రోజూ కొద్దిసేపు సూర్యకాంతిని స్వీకరించడం ద్వారా అనేక అనారోగ్యాల నుంచి దూరంగా ఉండొచ్చు. అందుకే సూర్యుడిని ఆరోగ్య దేవుడిగా కొలిచిన మన పూర్వీకుల జ్ఞానం నేటికీ అంతే ప్రాసంగికం.