Shani Jayanti: శని జయంతి రోజు శని దోషం ఉన్నవారు ఎలాంటి పరిహారాలు పాటించాలో మీకు తెలుసా?
శని దోషంతో బాధపడుతున్న వారు శని జయంతి రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Thu - 8 May 25

హిందూమతంలో శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా కర్మ దేవుడుగా పిలుస్తూ ఉంటారు. అంటే మనం చేసే మంచి చెడు పనులను బట్టి శనీశ్వరుడు శుభ అశుభ ఫలితాలను అందిస్తూ ఉంటారు. అయితే చాలామంది శనీశ్వరుడిని పూజించాలి అన్నా కూడా భయ పడుతూ ఉంటారు. ఇకపోతే శనికి సంబంధించిన సమస్యలతో శని దోషంతో బాధపడుతున్న వారు శని జయంతి రోజున కొన్ని రకాల పరిహారాలను పాటించాలని చెబుతున్నారు. మరి ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు ఆరోజు ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే.. వైశాఖ మాసంలోని అమావాస్య తిధి మే 26న మధ్యాహ్నం 12:11 గంటలకు ప్రారంభం అయ్యి ఈ తిధి మరుసటి రోజు అంటే మే 27న రాత్రి 8:31 గంటలకు ముగుస్తుందట.
కాబట్టి శనీశ్వరుడి జయంతిని మే 27వ తేదీ మంగళవారం జరుపుకోనున్నారు. శని జయంతి రోజున దాన ధర్మాలు చేయడం శుభప్రదమైనదట. ఈ రోజున శనిదేవుడుకి ఇష్టమైన నల్ల నువ్వులు, మినపప్పు, నల్ల బట్టలు, ఇనుప వస్తువులు, ఉక్కు పాత్రలు, దుప్పట్లు మొదలైన వాటిని పేదలకు దానం చేయడం వల్ల శని దేవుడి సంతోషిస్తాడట. శని జయంతి రోజున హనుమంతుడి ఆలయానికి లేదా శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి శని దేవుడిని పూజించడం మంచిది అని, అలాగే ఇనుప లేదా ఉక్కు పాత్రలో ఆవ నూనె పోసి మీ ప్రతిరూపాన్ని చూడాలని చెబుతున్నారు. ఆ తరువాత ఆ నూనెను ఎవరైనా పేదవారికి దానం చేయాలట. ఇలా చేయడం ద్వారా శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందట.
శని జయంతి రోజున ఉదయం, సాయంత్రం “ఓం శనైశ్చరాయ నమః” మంత్రాన్ని 108 సార్లు జపించాలని చెబుతున్నారు.. అలాగే ఈరోజున కుక్కలకు, ఆవులకు,కాకులకు, వికలాంగులకు, రోగులకు ఆహారం పెట్టాలట. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు సంతోషిస్తాడట. ఈ పరిహారం చేసిన వ్యక్తి జీవితంలో ఎటువంటి కొరతా ఉండదని చెబుతున్నారు. శని మహా దశ నుంచి బయటపడటానికి శనీశ్వర జన్మదినోత్సవం రోజున చీమలకు నల్ల నువ్వులు, చక్కెర కలిపిన పిండిని ఆహారంగా అందిచాలట. ఈ పరిహారాన్ని ఏడు శనివారాలు చేయాలన, అలాగే నల్ల మినపప్పు పిండితో చేసిన ఆహారాన్ని చేపలకు తినిపించాలని చెబుతున్నారు. ఈ పరిహారం శని మహాదశ నుంచి ఉపశమనం కలిగిస్తుందట. ఎవరి జాతకంలోనైనా శని గ్రహం స్థానం బలహీనంగా ఉంటే ఈ చర్యల వలన జాతకంలో శని స్థానం బలపడుతుందని పండితులు చెబుతున్నారు.