Maha Kumbh 2025 Security: మహా కుంభమేళాలో తొక్కిసలాట తర్వాత మొదటి ‘అమృత స్నాన్’ వద్ద భారీ మార్పులు!
సంగం వద్ద రద్దీని తగ్గించడానికి 44 ఘాట్‌లను నిర్మించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం నాడు మహాకుంభాన్ని సందర్శించారు.
- By Gopichand Published Date - 02:04 PM, Sun - 2 February 25

Maha Kumbh 2025 Security: వసంత పంచమి సందర్భంగా రేపు అంటే సోమవారం మహాకుంభంలో మూడో అమృత స్నానాన్ని నిర్వహించనున్నారు. ఈ సమయంలో 4-5 కోట్ల మంది భక్తులు సంగమంలో స్నానాలు చేస్తారు. జనవరి 29న సంగం ఒడ్డున తొక్కిసలాట జరిగిన తర్వాత ఇది మొదటి అమృత స్నాన్. ఇలాంటి పరిస్థితుల్లో యోగి ప్రభుత్వం మహాకుంభ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు (Maha Kumbh 2025 Security) చేసింది. తొక్కిసలాట లాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ప్రతి కూడలిలో పోలీసులను మోహరించారు.
లక్నో నుంచి పోలీసులు
మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట దృష్ట్యా మహాకుంభ జాతర ప్రాంతంలో అనేక మార్పులు చేశారు. లక్నో నుండి పోలీసు అధికారులు జాతరలో మోహరించారు. దీంతోపాటు డ్రోన్లు, కెమెరాలు, సీసీటీవీల సాయంతో జాతర ప్రాంతమంతా పర్యవేక్షిస్తున్నారు. విపత్తు నిర్వహణ దళాన్ని అప్రమత్తం చేశారు. స్నానాల కోసం ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. సంగం నగరంలోని అన్ని ఘాట్‌ల వద్ద ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, డైవర్లను మోహరించారు. దీంతో పాటు మహాకుంభంలో అంబులెన్స్‌లు, తాత్కాలిక ఆస్పత్రులు కూడా నిర్మించారు.
Also Read: Telephobia: టెలిఫోబియా అంటే ఏమిటి? బాధితులుగా 25 లక్షల మంది!
ప్రవేశం, ఎగ్జిట్‌లో మార్పులు
మహాకుంభం సందర్భంగా కొత్త ట్రాఫిక్ నిబంధనలను అమలు చేస్తూ అన్ని వాహనాల ప్రవేశాన్ని పరిపాలన నిలిపివేసింది. వీవీఐపీ పాసులను కూడా పూర్తిగా రద్దు చేశారు. వీవీఐపీ పాస్‌ని చూపి మహాకుంభానికి ఎవరూ వాహనం తీసుకెళ్లలేరు. అంతే కాకుండా ప్రధాన మార్గాలను వన్‌వేగా మార్చారు. భక్తులు కాళీరోడ్డు మీదుగా జాతర ప్రాంతానికి చేరుకుని త్రివేణి మార్గ్ మీదుగా తిరుగు ప్రయాణం అవుతారు. అన్ని ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లపై భద్రతా బలగాలు నిఘా ఉంచాయి. జనాలను అదుపు చేసేందుకు పారామిలటరీ బలగాలను మోహరించారు.
44 ఘాట్లలో భక్తులు స్నానాలు చేయనున్నారు
సంగం వద్ద రద్దీని తగ్గించడానికి 44 ఘాట్‌లను నిర్మించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం నాడు మహాకుంభాన్ని సందర్శించారు. అన్ని భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన తరువాత అతను హెలికాప్టర్ నుండి జాతర ప్రాంతాన్ని పర్యవేక్షించారు. వసంత పంచమి అమృత స్నాన్ ఈ రోజు ఉదయం 9:14 నుండి అంటే ఆదివారం ఉదయం నుండి ప్రారంభమవుతుంది. సోమవారం సాయంత్రం 6:52 వరకు కొనసాగుతుంది. ఉదయతిథి కారణంగా సోమవారం అమృత స్నానానికి ప్రధానమైన రోజుగా భావిస్తారు.
తొక్కిసలాట తర్వాత మార్పులు
అంతకుముందు జనవరి 29న మహాకుంభం రెండవ అమృత స్నాన్ వద్ద తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా 7 కోట్ల మందికి పైగా భక్తులు సంగమంలో స్నానాలు చేశారు. అయితే సంగం వద్ద బారికేడింగ్ విరిగిపడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు. ఈ విషాద సంఘటన తర్వాత పరిపాలన ఎలాంటి రిస్క్ తీసుకోదల్చుకోలేదు. అందుకే మహాకుంభ భద్రతను అనేక రెట్లు పెంచింది.