కామదా ఏకాదశి.. ఇలా చేస్తే కోరికలు నేరవేరతాయి!
ఈసారి కామదా ఏకాదశి 28 మార్చి 2026 ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు 29 మార్చి 2026 ఉదయం 7 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. ఉదయతిథి ప్రకారం ఏకాదశి వ్రతాన్ని మార్చి 29న ఆచరించాలి.
- Author : Gopichand
Date : 24-03-2026 - 4:27 IST
Published By : Hashtagu Telugu Desk
Kamada Ekadashi 2026: హిందూ ధర్మంలో అన్ని తిథులలోకి ఏకాదశి తిథికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఏడాదికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఇప్పుడు కామదా ఏకాదశి రాబోతోంది. చైత్ర మాసం శుక్ల పక్షం 11వ తిథి నాడు ఈ ఏకాదశి వస్తుంది. “కామదా” అంటే కోరిన కోర్కెలు తీర్చేది అని అర్థం. కామదా ఏకాదశి నాడు పూజలు చేసి, ఉపవాసం ఉండటం వల్ల అన్ని కోరికలు నెరవేరడమే కాకుండా ఎంతటి పెద్ద పాపాల నుండి అయినా విముక్తి లభిస్తుందని నమ్మకం. అయితే కథ వినకుండా ఈ వ్రతం పూర్తి కాదని చెబుతారు. ఈసారి కామదా ఏకాదశి ఎప్పుడు, దాని ప్రాముఖ్యత, కథ గురించి తెలుసుకుందాం.
కామదా ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం
ఈసారి కామదా ఏకాదశి 28 మార్చి 2026 ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు 29 మార్చి 2026 ఉదయం 7 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. ఉదయతిథి ప్రకారం ఏకాదశి వ్రతాన్ని మార్చి 29న ఆచరించాలి.
పూజ శుభ ముహూర్తం: ఉదయం 7:48 నుండి మధ్యాహ్నం 12:26 వరకు.
వ్రత పారణ (ఉపవాసం విరమించే సమయం): మార్చి 29 సాయంత్రం 6:14 నుండి మరుసటి రోజు మార్చి 30 ఉదయం 7:09 వరకు.
Also Read: పంజాబ్ ఆటగాళ్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కోచ్!
కామదా ఏకాదశి వ్రత కథ
విష్ణు పురాణం ప్రకారం.. పూర్వకాలంలో భోగిపుర అనే గ్రామం ఉండేది. అక్కడ పుండరీక అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో అనేకమంది అప్సరసలు, కిన్నెరలు, గంధర్వులు ఉండేవారు. వారిలో లలిత, లలిత్ అనే భార్యాభర్తలు ఉండేవారు. వారి మధ్య విడదీయలేని ప్రేమ ఉండేది.
ఒకరోజు లలిత్ రాజు పుండరీక దర్బార్‌లో గానం చేస్తుండగా అకస్మాత్తుగా అతనికి తన భార్య లలిత గుర్తుకు వచ్చింది. దానివల్ల అతని స్వరంలో లయ తప్పింది. దీనికి ఆగ్రహించిన పుండరీక రాజు.. లలిత్‌ను రాక్షసుడిగా మారిపోమని శపించాడు. ఆ శాపం వల్ల లలిత్ మాంసాహారం తినే భయంకరమైన రాక్షసుడిగా మారిపోయాడు.
రాజశాపం వల్ల లలిత్ నోటి నుండి నిప్పులు రావడం మొదలయ్యాయి. శరీరం సూర్యచంద్రుల వలె మండసాగింది. జుట్టు పర్వతంలా నిక్కబొడుచుకుంది. చేతులు చెట్లలా పెద్దవిగా మారాయి. తన పాపాన్ని అనుభవిస్తూ లలిత్ అడవుల వెంట తిరగసాగాడు. అతనితో పాటు భార్య లలిత కూడా అడవుల్లో తిరుగుతూ వింధ్యాచల పర్వతం చేరుకుంది. అక్కడ ఆమెకు ఒక ఋషి కనిపించారు. ఆమె బాధను చూసి కారణం అడగగా లలిత తన భర్తకు తగిలిన శాపం గురించి వివరించి, విముక్తి మార్గాన్ని అడిగింది.
అప్పుడు ఆ ఋషి, “త్వరలో కామదా ఏకాదశి రాబోతోంది, నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ధారపోస్తే, అతనికి శాప విముక్తి కలుగుతుంది” అని చెప్పారు. లలిత ఆ వ్రతాన్ని విధివిధానాలతో పూర్తి చేసి, తన పుణ్యఫలాన్ని భర్తకు ఇచ్చింది. వెంటనే లలిత్ తిరిగి సాధారణ రూపంలోకి వచ్చాడు. అప్పుడు వశిష్ట ముని “ఈ వ్రతం చేయడం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ ప్రపంచంలో దీనికి సమానమైన వ్రతం మరొకటి లేదు” అని చెప్పారు.