TTD : తిరుమల వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ పూర్తి
రేపు వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడ ఎలాంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ తెలిపింది.
- By Latha Suma Published Date - 11:49 AM, Thu - 9 January 25

TTD: తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ పూర్తి అయింది. కోటా పూర్తవడంతో కౌంటర్లు మూసివేశారు. 10, 11, 12 తేదీలకు సంబంధించి(రోజుకు 40 వేల చొప్పున) లక్షా 20 వేల టోకెన్లు జారీ చేశారు. 13వ తేదీ నుంచి తిరిగి ఏ రోజుకారోజు టోకెన్లు జారీ చేయనున్నారు.
టోకెన్ల జారీ ప్రక్రియ సందర్భంగా బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తొక్కిసలాట అనంతరం టీటీడీ అధికారులు, పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది టోకెన్ల జారీ ప్రక్రియను మరల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కొనసాగకుండా నిర్వహించారు. గురువారం ఉదయం కోటా పూర్తవడంతో కౌంటర్లను మూసేసినట్లు టీటీడీ పేర్కొంది. మొత్తం 3 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు 1లక్షా 20 వేల టోకెన్లు జారీ చేయగా.. రోజుకు 40 వేల చొప్పున జారీ చేసినట్లు టీటీడీ వెల్లడించింది.
కాగా, టీటీడీ తిరుమలలో తొక్కిసలాట ఘటనతో అలర్ట్ అయింది. రేపు వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడ ఎలాంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తుంటారు. అలాంటిది వైకుంఠ ద్వారం ద్వారా వెళ్లి అత్యంత దగ్గర నుంచి శ్రీవారిని దర్శించుకుంటే ఆ ఆనందం మాటలకు అందదు. అందుకే శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకునేందుకు టీటీడీ పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. ఇలా పది రోజుల పాటు ఈ ప్రత్యేక దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది.
Read Also: Ex Gratia: బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా: మంత్రి