Arley Morning: ధనప్రాప్తి కలగాలంటే ఉదయాన్నే ఇలా చేయాల్సిందే!
ఉదయాన్నే లేచిన తర్వాత కొన్ని వస్తువులను చూడడం ద్వారా ధన ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు.
- Author : Anshu
Date : 10-09-2024 - 12:30 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా మనలో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూసుకునే అలవాటు ఉంటుంది. ఇంకొందరు వారికి ఇష్టమైన వ్యక్తుల ముఖాలు చూస్తే మరికొందరు దేవుళ్ళ ఫోటోలను విగ్రహాలను చూస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం అవేమీ పట్టించుకోకుండా లైఫ్ ని గడుపుతూ ఉంటారు. అయితే ఉదయాన్నే అరచేతులను చూస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని,ఆరోజు అంతా బాగా ఉంటుందని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. ఉదయాన్నే అరచేతులను చూడటం అన్నది శుభ శకునానికి, అదృష్టానికి సంకేతం అంటున్నారు.
అలాగే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత పాలు, పెరుగు వంటి తెల్లని వస్తువులను చూడటం కూడా చాలా మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ రెండు వస్తువులను ఉదయాన్నే చూడటం వల్ల మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుందట. ఈ రెండూ స్వచ్ఛతకు చిహ్నాలు అని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఉదయాన్నే పక్షుల శబ్దాలను వినడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు. వాటితో పాటుగా మీ మనసుకు ప్రశాంతత కలిగించే శబ్దాలను వినడం కూడా మంచిదేనట. అలా కాకుండా ఏడుపులు కేకలు, కొట్లాటలు విని ఆ శబ్దానికి మేలుకుంటే ఆరోజు అంతా మూడిగా ఉండడంతో పాటు కోపంగా ఉండి, ఎవరో ఒకరితో గొడవలు పడుతూనే ఉంటారట. వీటికి బదులుగా శంఖం లేదా గంట శబ్దం వినడం మంచిదట.
చెరకును శుభసూచకంగా భావిస్తారు. అందుకే చెరుకును తులసి పూజ, ఇతర శుభకార్యాల సమయంలో ఉపయోగిస్తారు. చెరుకు లక్ష్మీ, విష్ణువులకు ఎంతో ఇష్టమట. అయితే ఉదయాన్నే మీరు లేచిన వెంటనే చెరుకు చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కొన్ని చోట్ల గుడ్లగూబను శుభసూచకంగా భావిస్తారు. దీన్ని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని కూడా చెప్తుంటారు. అయితే ఇంకొన్ని చోట్ల గుడ్లగూబలను అశుభంగా భావిస్తారు. ఉదయం నిద్రలేవగానే లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబను చూడటం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. ఏదైనా ముఖ్యమైన పనిమీద ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆ సమయంలో ఎరుపు రంగు చీరతో అలంకరించిన సుమంగళిని చూస్తే మీరు చేసే పనిలో విజయం లభిస్తుందని చెబుతున్నారు పండితులు. కాబట్టి ధనప్రాప్తి కలగాలి అనుకున్న వారు ఉదయాన్నే పైన చెప్పిన విధంగా చేస్తే తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.