మాఘ మాసంలో వచ్చే రథసప్తమి రోజు మీరు ఇలా చేశారంటే.. మీ పిల్లలు బాగుంటారు !
- Author : Vamsi Chowdary Korata
Date : 23-01-2026 - 12:29 IST
Published By : Hashtagu Telugu Desk
Ratha Saptami 2026 రథసప్తమి పండుగ రోజు సూర్య భగవానుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే సంప్రదాయం ఉంది. ప్రతియేటా రథసప్తమి పండుగ మాఘ మాసం శుక్లపక్ష సప్తమి తిథి రోజున వస్తుంది. ఆ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి ఏడు గుర్రాల రథంపై ప్రయాణం సాగిస్తాడని.. ఈరోజున సూర్యభగవానుడిని ఆరాధిస్తే ఎంతో శుభప్రదమని చెబుతారు. అంతేకాకుండా కొన్ని నియమాలను పాటించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతారు.
మాఘ శుద్ధ సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి. దీనినే సూర్య జయంతి ( Surya Jayanti 2026 ) అని కూడా అంటారు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యభగవానుడు రథాన్ని ఎక్కి తన దిశను మార్చుకునే రోజు. హిందూ సంప్రదాయం ప్రకారం రథసప్తమి 2026 రోజు సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ మాసం శుక్ల పక్షం సప్తమి తిథి రోజున ఈ రథ సప్తమి వస్తుంది. ఈ రథ సప్తమి 2026 పండుగను జనవరి 25వ తేదీ ఆదివారం రోజు జరుపుకోనున్నారు. ఈరోజున సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయణం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ మాఘ సప్తమి తిథి నుంచి రానున్న ఆరు మాసాలను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో రథ సప్తమి 2026 రోజు పాటించాల్సిన అతిముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మాఘమాసం సూర్యారాధనకు ఎంతో విశిష్టమైనది. అంతే కాకుండా ఆదివారం + సప్తమి తిథి కలిసి వస్తే ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. ఈ రథ సప్తమి రోజున ఆకాశంలో నక్షత్ర మండలం రథాకారంలో కనబడుతుందని కూడా చెబుతారు. ఈరోజున సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వడం, సూర్యుడికి పాలు పొంగించడం వంటివి అత్యంత శుభప్రదం. ఈ పొంగిన పాలతో వండిన పాయసం సూర్యుడికి ప్రీతికరమైనది. ఇక ఈరోజున చేసే పూజల వల్ల సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందని కూడా చెబుతారు.
పిల్లలు బాగుండాలంటే..
ఈ రథ సప్తమి వేళ చేసే స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. కాబట్టి ఈ రథ సప్తమి రోజున చిన్న పిల్లలకు స్నానం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభప్రదమని పండితులు చెబుతారు. ఈరోజున అరుణోదయ సమయం అంటే సూర్యోదయానికి సుమారు 1.30 గంటల ముందు.. స్నానం చేయించాలి. స్నానం చేసే సమయంలో పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి అర్క పత్రాలు అంటే జిల్లేడు ఆకులను తల, భుజాలు, ఛాతీ, మోచేతులు, మోకాళ్లు, అర చేత్తుల్లో మొత్తం 7 జిల్లేడు ఆకులను ఉంచి స్నానం చేయించాలి. అనంతరం సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఈ సమయంలో సూర్య మంత్రాలను పఠించడం ఎంతో శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, సిరిసంపదలు కలుగుతాయని పెద్దలు చెబుతారు.
రథసప్తమి రోజున చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల జాతకంలో సూర్య స్థానం బలపడుతుంది. ఆరోజు పొరపాటున కూడా ఉప్పు తినకూడదని చెబుతారు. అలాగే రథ సప్తమి రోజున ఉప్పు దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. నదిలో లేదా పారే నీటిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిదట. ఇలా చేయడం వల్ల కుటుంబ, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం. బెల్లం, ఆవు నెయ్యితో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం శుభప్రదం. ఈరోజున చేసే దానధర్మాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.