మౌని అమావాస్య నాడు ఇలా చేస్తే.. హర్ష యోగం ప్రాప్తిస్తుంది
- Author : Vamsi Chowdary Korata
Date : 14-01-2026 - 10:26 IST
Published By : Hashtagu Telugu Desk
Mauni Amavasya మనం మాట్లాడే మాటల కంటే మౌనం అత్యంత శక్తివంతమైనదని, విశిష్టమైనదని నిరూపించే రోజే పవిత్రమైన రోజే ఈ మౌని అమావాస్య. పవిత్ర నదీ సంగమంలో లక్షల సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే ఈ విశిష్టమైన రోజుకు పితృ దేవతల ఆశీస్సులు పొందే శక్తి కూడా ఉందని నమ్ముతారు. ఈ అమావాస్య రోజున మౌనంగా ఉంటూ చేసే ధ్యానం అంతర్గతంగా మనిషిని అత్యంత శక్తివంతుడిని చేస్తుందని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 2026 జనవరి నెలలో రానున్న మౌని అమావాస్య తేదీ, తిథి వివరాలు తెలుసుకుందాం.
ఈ ఏడాది జనవరి 18వ తేదీ ఆదివారం మౌని అమావాస్య రానుంది. ఈ అమావాస్యను ప్రత్యేకమైనదిగా మన పురాణాలు పేర్కొంటున్నాయి. మౌని అంటే మౌనంగా ఉండటం అని అర్థం. ఈ మౌని అమావాస్య రోజున మౌనదీక్ష పాటించాలి. అలాగే ఈ రోజున నదీ స్నానం ఆచరించడం, దానధర్మాలు చేయడం, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి పండుగకు ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధకులు ఈ మౌని అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఈ Amavasya రోజున గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
మౌని అమావాస్య 2026 శుభ ముహూర్తం
ఈ ఏడాది 2026 సంవత్సరంలో ఈ మౌని అమావాస్య జనవరి 18వ తేదీ ఆదివారం రోజు వస్తోంది. ఈ రోజున అంటే జనవరి 18వ తేదీ తెల్లవారుజామున 12:03 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమమవుతుంది. మరుసటి రోజు అంటే 2026 జనవరి 19వ తేదీన తెల్లవారుజామున 01:21 గంటల వరకు ముగుస్తుంది. అయితే ఉదయ తిథి ప్రాముఖ్యత ప్రకారం జనవరి 18వ తేదీ ఆదివారం రోజు మౌని అమావాస్య జరుపుకోవాలి. ఈరోజునే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడం, దానధర్మాలు చేయడం మంచిది. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం 05:27 నుంచి 06:21 గంటల మధ్య పవిత్ర స్నానం ఆచరించడం ఎంతో శ్రేష్టమని శాస్త్రవచనం.