Holi: ఇక్కడ రంగులకు బదులు శవాల బూడిదతో హోలీ ఆడతారు
కాశీలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ వద్ద శివుడు ఆడే చిత్రమైన హోలి ఇది. కాశీలో జరిగే ఈ విచిత్రమైన, ప్రత్యేకమైన సంప్రదాయం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
- By Vamsi Korata Published Date - 08:00 AM, Sun - 5 March 23

దేశమంతటా హోలీ (Holi) సంబరాలు ఎంత ఘనంగా జరుగుతాయో మీకు తెలిసిందే. అయితే, ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన సంప్రదాయం పాటిస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో హోలీ జరుగుతుంది. ఈ ఏడాది మార్చి 8న హోలీ జరగనుంది. దేశమంతా రంగులు, గులాల్ తో హోలీ ఆడుతుంటారు. కానీ విశ్వేశ్వరుడి నగరం కాశీలో మాత్రం ఒక చిత్రమైన హోలీ జరుగుతుంది. ఇక్కడ చితాభస్మంతో హోలీ జరుపుకుంటారు. దీన్ని మసానే కీ హోలీ అని చెప్తారు. ఈ సంప్రదాయం సాక్షాత్తు శివశంకరుడే ప్రారంభించినట్టు పురాణాలు చెబుతున్నాయి. రంగ్‌బరీ ఏకాదశి రెండవ రోజున కాశీలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ వద్ద శివుడు ఆడే చిత్రమైన హోలి ఇది.
అలా మొదలైంది:
రంగ్‌బరీ ఏకాదశి రోజున పరమశివుడు పార్వతి దేవిని పూజించిన తర్వాత కాశీకి తీసుకువచ్చాడు. అప్పుడు శివుడు పార్వతితో గులాల్ తో గణాలందరితో కలిసి హోలీ ఆడుకున్నాడు. కానీ శ్మశానంలో నివసించే ప్రేతాత్మలు, పిశాచాలు, యక్ష గంధర్వులు, నపుంసకుల వంటి సకల గణాలతో కలిసి హోలీ జరుపుకోలేదు. అందుకే రంగ్‌బరీ ఏకాదశి తర్వాత మహాదేవ్ శ్మశాన వాటికలో నివసించే వీరందరితో హోలీ ఆడాడని ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ పరమ శివుడి దృష్టిలో సృష్టిలో అన్ని సమానమే అనడానికి ఇదొక సంకేతం.
మసానే కీ హోలీ (Holi):
కాశీ దేశంలో రంగులు అబీర్ గులాల్ కాకుండా మండుతున్న చితుల మధ్య చితాభస్మంతో హోలీ ఆడే ఏకైక నగరం. శివభక్తులు చితా భస్మ హోలీలో భీకరంగా నర్తిస్తారు. మణికర్ణకా ఘాట్ లోని శ్మశాన వాటికలో హరహర మహాదేవ్ కీర్తనల నడుమ ఈ ఉత్సవం సాగుతోంది. మోక్ష ప్రదాయిని కాశీలో శివుడు స్వయంగా తారక మంత్రాన్ని జపిస్తాడని నమ్ముతారు. హోలీ నాడు చితా భస్మాన్ని ఒకరికొకరు సమర్పించుకోవడం ద్వారా అబిర్ గులాల్ తో వచ్చే ఆనందం, శ్రేయస్సు, కీర్తి తో పాటు ఆ మహాదేవుడి కరుణా కటాక్షాలు కూడా ప్రాప్తిస్తాయని నమ్మకం.
హరిశ్చంద్ర ఘాట్ లో నిరంతరాయంగా చితులు మండుతూనే ఉంటాయి. ఇక్కడ చితాభస్మంతో హోలీ జరపడం అంటే జనన మరణాలు నిత్య కృత్యాలనే అత్యంత సత్యాన్ని మరోసారి గుర్తుచేసుకోవడం. మరణం విషాదం కాదని విముక్తి అని మరోకోణంలో కూడా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి మహా స్మశానం కాశీలో జరిగే ఈ చితా భస్మ హోలీ ఆధ్యాత్మిక ఆనందాల ఉత్సవంగా చెప్పుకోవచ్చు.
Also Read: Self-Driving Cars: వామ్మో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. వాహనదారుల బెంబేలు

Related News

TTD News: మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త!
తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ గొప్ప శుభవార్త చెప్పింది. నడక దారిలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు ఇస్తునట్లు తెలిపింది.