Gods Laddoo Shop: దేవుడి లడ్డూ షాప్.. డబ్బులుంటే ఇవ్వొచ్చు.. లేకుంటే ఫ్రీ
విజయ్ పాండే(Gods Laddoo Shop).. జబల్‌పూర్‌లోని నేపియర్ టౌన్ ఏరియాలో నివసిస్తుంటారు.
- By Pasha Published Date - 07:39 PM, Thu - 13 March 25

Gods Laddoo Shop : ఆ దుకాణం పేరు.. ‘‘శ్రీ లడ్డూ గోపాల్’’. దాని నిండా లడ్డూ పెట్టెలే ఉంటాయి. కానీ నిర్వాహకులు ఎవరూ ఉండరు. భక్తులు లోపలికి వెళ్లి తమకు అవసరమైనన్ని లడ్డూ పెట్టెలు తీసుకోవచ్చు. వాటిపై ఉన్న ధర ప్రకారం లెక్క చేసి.. డబ్బులను హుండీలో వేయొచ్చు. క్యాష్ లేకుంటే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. డబ్బులు లేకుంటే ఫ్రీగానే లడ్డూ పెట్టెలను తీసుకెళ్లొచ్చు. లడ్డూ గోపాల స్వామి పేరిట ఏర్పాటు చేసిన ఈ దైవాధీన దుకాణం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో ఉంది. లడ్డూ గోపాల్ అంటే బాల గోపాలుడు. ఉత్తరాది రాష్ట్రాల్లో లడ్డూ గోపాల్ ఆలయాలు ఎక్కువే ఉంటాయి. లడ్డూ గోపాల స్వామికి లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇంతకీ ‘‘శ్రీ లడ్డూ గోపాల్’’ దుకాణాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం..
Also Read :Diners Urinated: సూప్‌లో మూత్రం పోసిన నీచులు.. 4 వేల మందికి పదింతల పరిహారం
పేదల కోసమే..
‘‘శ్రీ లడ్డూ గోపాల్’’ దుకాణాన్ని విజయ్ పాండే నిర్వహిస్తున్నారు. ఈయన లడ్డూ గోపాల స్వామికి పెద్ద భక్తుడు. అందుకే ఈ దుకాణంలో కూర్చోరు. స్వయంగా ఆ దేవుడే దుకాణాన్ని చూసుకుంటాడని విజయ్ నమ్మకం. డబ్బులు లేని పేదలు తమ పేదరికం గురించి బయటికి చెప్పుకోకుండా, లడ్డూలు ఫ్రీగా తీసుకోవాలనేది విజయ్ కోరిక. డబ్బులున్న వారు నిజాయితీగా డబ్బులను హుండీలో వేస్తారనేది ఆయన విశ్వాసం. అందుకే తన దుకాణంలో విజయ్ పాండే కూర్చోరు.
Also Read :YV Vikrant Reddy : వైవీ విక్రాంత్‌రెడ్డి ఎవరు ? ఆయనపై అభియోగాలు ఏమిటి ?
ఒక పేదవాడు.. విజయ్ పాండే.. ఉద్దెర లడ్డూలు
విజయ్ పాండే(Gods Laddoo Shop).. జబల్‌పూర్‌లోని నేపియర్ టౌన్ ఏరియాలో నివసిస్తుంటారు. తొలినాళ్లలో ఆయన ఇంట్లోనే చిన్నపాటి లడ్డూ దుకాణాన్ని నిర్వహించేవారు. లడ్డూలను స్వయంగా విజయ్ తయారు చేసేవారు. ఎంతో మంది భక్తుల నుంచి ఆయనకు లడ్డూల తయారీ ఆర్డర్లు లభించేవి. ఒకసారి నిరుపేద భక్తుడు ఒకరు విజయ్ పాండే ఇంటికి వచ్చారు. తన దగ్గర డబ్బులు లేవని, ఉద్దెర కింద లడ్డూలు ఇవ్వాలని కోరాడు. అతడి మాటలు విని విజయ్ పాండే చలించిపోయాడు. తన స్థానంలో ‘‘లడ్డూ గోపాల్ స్వామీజీ’’ (దేవుడు) ఉండి ఉంటే.. ఆ పేద భక్తుడికి వెంటనే లడ్డూలను ఇచ్చి ఉండేవాడని మనసులో విజయ్ అనుకున్నాడు. ఈ ఆలోచన వల్లే ‘‘శ్రీ లడ్డూ గోపాల్’’ పేరిట దుకాణాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక లడ్డూ దుకాణాన్ని దేవుడి పేరిట ఏర్పాటు చేశారు. ఇందులో పేదలకు లడ్డూలు ఫ్రీ. డబ్బున్న వారు హుండీలో డబ్బులు వేసి, లడ్డూలు తీసుకోవచ్చు.