ఈ ఏడాది పండుగల తేదీలు..
- Author : Vamsi Chowdary Korata
Date : 03-01-2026 - 11:45 IST
Published By : Hashtagu Telugu Desk
Festivals in 2026 నూతన సంవత్సరం 2026 ఆగమనానికి సమయం ఆసన్నమైంది. కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడానికి ఇప్పటికే అందరూ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హిందూ పంచాంగం ప్రకారం అధిక మాసం ఎప్పుడొచ్చింది.. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పండుగలైన సంక్రాంతి 2026, హోలీ 2026, మహాశివరాత్రి 2026, ఉగాది 2026, వినాయక చవితి 2026, రంజాన్ 2026, దసరా నవరాత్రి 2026, దీపావళి 2026 తేదీలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నూతన సంవత్సరం 2026 జనవరి 1వ తేదీ గురువారం (Thursday) నుంచి ప్రారంభం కానుంది. అయితే కొత్త ఏడాది 2026లో హిందూ పంచాంగం (Hindhu Panchang) ప్రకారం అనేక ముఖ్యమైన పండుగలు, వ్రతాల తేదీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీనికి కారణం ఈ ఏడాదిలో అధిక మాసం (2026 మే 17 నుంచి జూన్ 15 వరకు) ఉండటమే. దీంతో కొత్త ఏడాది (New Year 2026)లో పండుగలు, వ్రతాలు ఒక నెల ముందుకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం 2026 పండుగల క్యాలెండర్ (2026 Festival Calendar Telugu) ప్రకారం ప్రధాన పండుగల తేదీలను (Festival Dates 2026) ఇక్కడ తెలుసుకుందాం.
సంక్రాంతి 2026
తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. అందుకే సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈ పండుగను ముచ్చటగా మూడు రోజులు వైభవంగా జరుపుకుంటారు.
జనవరి 14 బుధవారం : భోగి పండుగ 2026 (Bhogi 2026)
జనవరి 15 గురువారం : ఉత్తరాయణం ప్రారంభం, మకర సంక్రాంతి 2026 (Makar Sankranti 2026)
జనవరి 16 శుక్రవారం : కనుమ పండుగ 2026 (Kanuma 2026)
హోలీ 2026
ఈ హోలీ పండుగను రంగుల పండుగ అని కూడా అంటారు. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ శ్రీకృష్ణుడు పెరిగి ప్రాంతాలైన మథుర, బృందావనంలో ఘనంగా 16 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ పండుగను 2026 మార్చి 4వ తేదీ బుధవారం జరుపుకోనున్నారు.
మహాశివరాత్రి 2026
ఈ మహాశివరాత్రి పండుగ హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ. శివుడు తాండవం చేసిన రాత్రిగా భావిస్తారు. ఈరోజున భక్తులు నియమ నిష్టలతో ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు. రాత్రిపూట మేల్కొని భక్తి కీర్తనలు, మంత్రాలు పఠిస్తూ ఆధ్యాత్మిక తన్మయత్వంతో జాగరణ చేస్తారు. ఇక ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను 2026 ఫిబ్రవరి 15 ఆదివారం రోజు జరుపుకుంటారు.
ఉగాది 2026
ఉగాది అంటే మనందరికీ గుర్తొచ్చేది ఇది మన తెలుగు వారి పండుగ అని. తెలుగు సంవత్సరం ఈ ఉగాది పండుగ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఉగాది తెలుగు వారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వచ్చే ఈ పర్వదినానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఉగాది రోజున పండితులు చెప్పే పంచాంగ శ్రవణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే ఈ ఏడాదిలో ఉగాది పండుగను 2026 మార్చి 19వ తేదీ గురువారం రోజు జరుపుకుంటారు.
రంజాన్_ 2026
రంజాన్ అనేది ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్‌లోని తొమ్మిదవ నెల. ఇది ముస్లింలకు పవిత్రమైన మాసం. ఉపవాసం, ప్రార్థనలకు ఈ మాసంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఖురాన్ అవతరించిన నెలగా పరిగణిస్తారు. ఆత్మశుద్ధి, దేవుడిపై భక్తి పెంపొందించుకోవడం, స్వార్థం తగ్గించుకోవడం ఈ పండుగ ప్రధాన లక్ష్యం. ఈ ఏడాది రంజాన్ పండుగను 2026 మార్చి 20 శుక్రవారం రోజు జరుపుకుంటారు.
వినాయక చవితి 2026
దేశవ్యాప్తంగా హిందువుల జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ పండుగను భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి రోజు జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా వినాయకుడు విగ్రహాలు ఏర్పాటు చేసి పది రోజుల పాటు పూజలు చేసి అనంత చతుర్దశి రోజున నిమజ్జనంతో ముగుస్తుంది. ఈ పండుగను 2026 సెప్టెంబర్ 14 సోమవారం రోజున జరుపుకుంటారు.
దసరా నవరాత్రి 2026
దసరా నవరాత్రి అనేది ముఖ్యమైన హిందూ పండుగ. దుష్టశక్తులపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి వివిధ రూపాలను పూజిస్తారు. చివరి రోజున విజయదశమిగా జరుపుకుంటారు. భారతదేశమంతటా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. భక్తులు ఉపవాసాలు, పూజలు, అలంకరణలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దసరా నవరాత్రి అనేది శక్తి, జ్ఞానం, ధైర్యం, పట్టుదలకు ప్రతీక. ఈ పండుగను 2026 అక్టోబర్ 20 మంగళవారం రోజు జరుపుకుంటారు.
దీపావళి 2026
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే పండుగ దీపావళి. ఆనందోత్సాహాలతో కుల మతాలకు అతీతంగా అన్యోన్యంగా, సమైక్యంగా జరుపుకునే పండుగ. ఈరోజున లక్ష్మీదేవిని, వినాయకుడిని, కుబేరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల సిరిసంపదలు, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. ఈ పండుగను మొత్తం 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఏడాది 2026 నవంబర్ 9వ తేదీ సోమవారం రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు.