Merry Christmas 2023 : క్రిస్మస్ సంథింగ్ స్పెషల్..!
ఈసారి మళ్లీ కోవిడ్ (COVID) ఆంక్షలు రావడంతో సెలబ్రేషన్స్ కాస్త డల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- By Vamsi Chowdary Korata Published Date - 06:00 AM, Sun - 25 December 22

ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్ (Merry Christmas). ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక ఈసారి మళ్లీ కోవిడ్ ఆంక్షలు రావడంతో సెలబ్రేషన్స్ కాస్త డల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో క్రిస్మస్ సంబురాలు (Merry Christmas) ప్రాంరభమయ్యాయి. అయితే క్రిస్మస్ పండుగ ఎలా వచ్చింది? దీని ప్రాముఖ్యత ఏమిటో? తెలుసుకుందాం..
మేరీకి కనిపించిన దేవ దూత:
రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. అయితే ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవ దూత కలలో కనబడి కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావని తెలిపిందట. అంతే కాదు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు’ అని దేవ దూత చెప్పాడు. ఏసు అంటే రక్షకుడు అని అర్థం.
గర్భం దాల్చిన మేరీ:
దేవ దూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒక రోజు రాత్రి కలలో అతనికి దేవ దూత కనపడి’ మేరీని నీవు విడిచిపెట్టవద్దు. ఆమె భగవంతుని వరం వల్ల గర్భవతి అయింది. కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరిని వాళ్ల పాపాల నుంచి రక్షిస్తాడు.’ అని చెప్పాడు.
పశువుల పాకలో జన్మించిన ఏసుక్రీస్తు:
తరువాత జోసెఫ్ మేరీ స్వగ్రామం బెత్లేహేమ్ కు వెళ్లారు. తీరా అక్కడకు చేరుకునేసరికి ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం ఇచ్చాడు. అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చింది. అలా రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబరు 24 న అర్థరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబరు 25న జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ (Christmas) జరుపుకుంటారని చెబుతారు.
గొర్రెల కాపరిలకు కనిపించిన దేవ దూత:
ఆ రాత్రి ఆ ఊరికి ప్రక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపరులు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవ దూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల కాపరులు భయపడ్డారు. “భయపడకండి ఇదిగో మీకొక సంతోషకరమైన శుభవార్త. ఇవ్వాళ బెత్లేహేమ్ లోని ఒక పశువుల పాకలో, లోక రక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డల్లో చుట్టబడి, పశువుల తొట్టిలో పండుకొని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు. అతడే లోక రక్షకుడు” అని దేవ దూత చెప్పాడు.
క్రిస్మస్ పండగ:
క్రిస్‌మస్ కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్‌లను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటిపై వేలాడ దీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్‌మస్ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగు రంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత.
Also Read: Weight Loss for Children : పిల్లలు ఈజీగా సన్నబడాలి అంటే ఇవి తినాలి..