Char Dham Yatra: ఏప్రిల్ 22 నుంచి చార్ ధామ్ యాత్ర..
చార్ ధామ్ యాత్ర సమీపిస్తోంది. భక్తులు ఏప్రిల్ - మే నుంచి అక్టోబర్ - నవంబర్ వరకు ఈ యాత్రకు వెళ్లొచ్చు.
- Author : Vamsi Chowdary Korata
Date : 20-02-2023 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra) సమీపిస్తోంది. భక్తులు ఏప్రిల్ – మే నుంచి అక్టోబర్ – నవంబర్ వరకు ఈ యాత్రకు వెళ్లొచ్చు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra) ప్రారంభం కానుంది. ఈ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను స్వీకరించడం ప్రారంభించింది. చార్ ధామ్ యాత్రకు హెలికాప్టర్ లో వెళ్లడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ బుకింగ్ లను స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి IRCTC వెబ్‌సైట్‌లో బుకింగ్ లు చేసుకోవచ్చు.
బద్రీనాథ్:
బద్రీనాథ్ ఆలయ తలుపులు 2023 ఏప్రిల్ 27వ తేదీన తెరచుకుంటాయి.2023 నవంబర్ 21వ తేదీన తాత్కాలికంగా మూసివేస్తారు. బద్రీనాథ్ ఆలయం ఎప్పుడు తెరచుకుంటుందో ఏటా వచ్చే వసంత పంచమి రోజు నిర్ణయిస్తారు. అలాగే ఆలయ తలుపులు ఎప్పుడు మూసివేయాలో విజయదశమి రోజున నిర్ణయిస్తారు.
కేదార్‌నాథ్:
కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు 2023 ఏప్రిల్ 25న తెరచుకుంటాయి. 2023 నవంబర్ 14న వచ్చే భాయీ దూజ్ రోజు ముసివేస్తారు. ఏటా కేదార్‌నాథ్ ఆలయం ఎప్పుడు తెరచుకుంటుందో మహా శివరాత్రి రోజున, ఆలయాన్ని తాత్కాలికంగా ఎప్పుడు మూసివేయాలో కూడా అదే రోజు నిర్ణయిస్తారు.
యమునోత్రి:
యమునోత్రి ఆలయ ద్వారాలు 2023 ఏప్రిల్ 22న తెరచు కుంటాయి. నవంబర్ 14వ తేదీన ఆలయ తలుపులు మూసుకుంటాయి.
గంగోత్రి:
గంగోత్రి ఆలయ తలుపులు 2023 ఏప్రిల్ 22 వ తేదీన తెరచుకుంటాయి. నవంబర్ 13వ తేదీ దీపావళి రోజున గంగోత్రి ఆలయ తలుపులు మూసుకుంటాయి. గంగోత్రి పవిత్ర క్షేత్రాన్ని ఏటా వచ్చే అక్షయ తృతీయ రోజున తెరచుకుంటాయి. అలాగే దీపావళి రోజున మూసుకుంటాయి
చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra) హెలికాప్టర్ సర్వీస్ ధర
చార్ ధామ్ యాత్ర హెలికాప్టర్ ద్వారా మొత్తం 5 రోజుల పాటు ఉంటుంది. ఢిల్లీ నుంచి ప్రారంభం అవుతుంది. ఒక వ్యక్తికి దాదాపు రూ.1.5 లక్షలు ఖర్చు అవుతుంది. డెహ్రాడూన్ నుండి కూడా హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చాలా మంది ఆపరేట్లు ఉన్నందున సర్వీస్ ప్రొవైడర్లను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. సహస్త్రధార రోడ్డులో ఉన్న డెహ్రాడూన్ ప్రభుత్వ హెలిప్యాడ్ నుండి యమునోత్రికి ఛాపర్ రైడ్ ఉంటుంది. చార్ ధామ్ హెలికాప్టర్ యాత్ర ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడే పూర్తవుతుంది. యమునోత్రి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాండింగ్ ప్లేస్ వద్ద దిగుతారు. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే రాత్రి బస చేస్తారు. చివరగా ఐదో రోజున బద్రీనాథ్ లో రాత్రి బస అయ్యాక అక్కడి నుండి డెహ్రాడూన్ కు తిరుగు ప్రయాణం అవుతారు.
Also Read: Chicken: రోజూ చికెన్ తినొచ్చా? తినకూడదా? నిపుణులు ఏమంటున్నారు?