Statue of Lord Rama : ఒంటిమిట్టలో 600 అడుగుల శ్రీరాముడి విగ్రహం!
Statue of Lord Rama : రామాలయం సమీపంలోని చెరువులో 600 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని(600 feet tall statue of Lord Rama) ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం
- By Sudheer Published Date - 09:30 AM, Fri - 26 September 25

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రమైనది. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు రాముని దర్శనార్థం ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా రామాలయం చుట్టుపక్కల వసతులను అభివృద్ధి చేసి, ఒంటిమిట్టకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సంకల్పించింది.
ఈ ప్రణాళికలో భాగంగా రామాలయం సమీపంలోని చెరువులో 600 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని(600 feet tall statue of Lord Rama) ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఈ విగ్రహం స్థాపనతో ఒంటిమిట్ట రామాలయం మాత్రమే కాకుండా, కడప జిల్లానే ఒక ప్రధాన ఆకర్షణగా మారనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు, భక్తులు ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ విగ్రహం ఒక మహోన్నత చిహ్నంగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు ఈ ప్రతిపాదనపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి TTD అధికారులకు అందజేశారు. నివేదికలో విగ్రహ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలు, భద్రతా ఏర్పాట్లు, పర్యావరణ పరిరక్షణ చర్యలు మొదలైన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే, ఒంటిమిట్ట జాతీయ పర్యాటక మ్యాప్‌లో వెలుగొందడం ఖాయం.