Happy Birthday Sonu : 5వేలతో ముంబైకి వచ్చి.. రియల్ హీరోగా ఎదిగిన సోనూ సూద్
Happy Birthday Sonu : హీరో కాదు .. రియల్ హీరో సోనూసూద్ 50వ బర్త్ డే ఈరోజే (జులై 30).
- Author : Pasha
Date : 30-07-2023 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
Happy Birthday Sonu : హీరో కాదు .. రియల్ హీరో సోనూసూద్ 50వ బర్త్ డే ఈరోజే (జులై 30).
కరోనా సమయం నుంచి ఇప్పటివరకు సోనూ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పవి..
ప్రత్యేకించి కొవిడ్ సంక్షోభం టైంలో ఎంతోమందికి మళ్ళీ జీవితంపై ఆశ చిగురించేలా చేసిన ఘనత సోనూసూద్ కు దక్కుతుంది.
అందుకే ఆయనను అందరూ రియల్ హీరో అని పొగడటం ప్రారంభించారు.
బుల్లితెరపై విలన్‌గా కనిపించినా.. నిజజీవితంలో సోనూసూద్ ఒక రియల్ హీరోలా రియాక్ట్ అయ్యాడు. బాలీవుడ్, సౌత్, హాలీవుడ్ చిత్రాలలో నటించిన ఈయన తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కరోనా కాలంలో కార్మికులు, పేదవారికి సహాయం చేసిన సోనూ సూద్.. ఇప్పుడు కూడా చాలామందికి సహాయం చేస్తున్నాడు. యాక్టర్ కావాలనే కలతో జేబులో రూ.5వేలు పెట్టుకొని ముంబైకి వచ్చిన సోనూసూద్ (Happy Birthday Sonu).. దేశంలోనే ఎంతో క్రేజ్ కలిగిన యాక్టర్స్ లో ఒకడిగా ఎదిగాడు. ఇప్పుడు ఆయన దగ్గర లగ్జరీ కారు, బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి. ఈవిజయం రాత్రికి రాత్రి రాలేదు. దాని వెనుక ఎంతో శ్రమ, ఎంతో కృషి, ఎంతో అంకితభావం ఉన్నాయి.
మొదటి మూవీ ప్లాప్ అయినా..
సోనూ సూద్ పంజాబ్‌లోని మోగాలో 1973 జూలై 30న జన్మించాడు. మూవీ ఇండస్ట్రీలో బాగా చదువుకున్న నటుల్లో సోనూసూద్ ఒకరు. ఆయన ఇంజనీరింగ్ చేశారు. ఇంజనీరింగ్ చేసే సమయంలోనే ఆయనకు యాక్టింగ్ పై, మోడలింగ్ పై ఇంట్రెస్ట్ కలిగింది. 2002లో “షహీద్-ఎ-ఆజం” మూవీతో భారత స్వాతంత్ర్య సమరయోధుడు “భగత్ సింగ్” పాత్రలో బాలీవుడ్‌లోకి సోనూ ఎంట్రీ ఇచ్చాడు. అదే సంవత్సరంలో హీరో అజయ్ దేవగన్ మూవీ “ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్” విడుదలైంది. అయితే, సోనూ యొక్క మొదటి మూవీ పంజాబ్, హర్యానాలో వివాదాల్లో చిక్కుకుంది. అందుకే దాన్ని ప్రదర్శించలేదు. దీంతో సోనూ మొదటి సినిమా ప్లాప్ అయింది. అయినా సోనూ సూద్ ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి, తనకంటూ ఒక రేంజ్ ను క్రియేట్ చేసుకున్నారు.

కూలీల “దేవుడు” ఎలా అయ్యాడు ?
కరోనా మహమ్మారి టైంలో లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం మూసివేయబడినప్పుడు.. సోనూ సూద్ ముందుకు వచ్చి వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేసి, వారిని ఇళ్లకు పంపారు. లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలకు అన్ని విధాలా సాయం అందించాడు. వారి కోసం బస్సుల ఏర్పాటు నుంచి మొదలుకొని.. భోజన వసతి దాకా అన్ని ఏర్పాట్లు చేశాడు. అందుకే ప్రజలు సోనూ సూద్‌ను కార్మికుల ‘దేవుడు’ అని పిలవడం ప్రారంభించారు. కొందరు సోను పేరు మీద షాప్ లు తెరిచారు. మరికొందరు పుట్టిన బిడ్డలకు సోనూ అని పేరు పెట్టుకున్నారు. ఇంకొందరు అభిమానులు సోనూ సూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.