Tollywood : కోట మరణం మరచిపోకముందే మరో నటి కన్నుమూత
Tollywood : దక్షిణ భారత సినిమా రంగాన్ని నాలుగు దశాబ్దాల పాటు తన అద్భుత నటనతో రంజింపజేసిన సీనియర్ నటి బి. సరోజాదేవి ఇకలేరు అనేది యావత్ ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు
- By Sudheer Published Date - 10:50 AM, Mon - 14 July 25

చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. కోటశ్రీనివాసరావు (Kotasrinivasarao) మరణ వార్త నుండి ఇంకా తేరుకోకముందే సీనియర్ నటి సరోజాదేవి (Veteran Actress B.SarojaDevi) కన్నుమూశారు. దక్షిణ భారత సినిమా రంగాన్ని నాలుగు దశాబ్దాల పాటు తన అద్భుత నటనతో రంజింపజేసిన సీనియర్ నటి బి. సరోజాదేవి ఇకలేరు అనేది యావత్ ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు. అనారోగ్యంతో బెంగళూరులోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు 87 సంవత్సరాల వయసు. ఆమె మరణ వార్తతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఆమె, నాలుగు భాషల్లో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టారు.
Saina Nehwal : వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సైనా-కశ్యప్
బి. సరోజాదేవి నటించిన పాండురంగ మహాత్మ్యం, భక్త ప్రహ్లాద, స్వర్గసీతా వంటి చారిత్రక భక్తి చిత్రాలు ఆమె నటనా కౌశలాన్ని చాటిచెప్పాయి. తెలుగు సినిమాల్లో ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడు మూతలు, పండంటి కాపురం, దాన వీర శూర కర్ణ, అల్లుడు దిద్దిన కాపురం వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, ఎంజీఆర్ వంటి అగ్రనటులతో స్క్రీన్ షేర్ చేసారు.
1955లో సినీరంగంలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే అగ్రనటిగా ఎదిగిన బి. సరోజాదేవికి భారత ప్రభుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలు ప్రదానం చేసింది. మహాకవి కాళిదాసు చిత్రానికి జాతీయ అవార్డు రావడంలో ఆమె పాత్ర కీలకమైంది. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి దక్షిణ భారత సినీ రంగానికి తీరని లోటుగా మారిందని అభిప్రాయపడుతున్నారు.