Saina Nehwal : వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సైనా-కశ్యప్
Saina Nehwal : “మేము వ్యక్తిగత శాంతి, అభివృద్ధి మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ నిర్ణయం సులభం కాదు కానీ అవసరమైందని భావించాం” , "గతానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తు ప్రయాణానికి ఒకరికొకరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం
- By Sudheer Published Date - 07:48 AM, Mon - 14 July 25

ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత బాడ్మింటన్ గర్వంగా నిలిచిన సైనా నెహ్వాల్ (Saina Nehwal) తన భర్త పారుపల్లి కశ్యప్(Parupalli Kashyap)తో విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆదివారం రాత్రి ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ విషయాన్నీ తెలియజేశారు. “జీవితం కొన్నిసార్లు మనలను వేర్వేరు దిశలలో నడిపిస్తుంది. చాలా ఆలోచించి, భావించి, నేను మరియు కశ్యప్ విడిపోయాలని నిర్ణయించుకున్నాం” అని ఆమె పేర్కొన్నారు. 2018 డిసెంబరు 14న ఇద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు.
సైనా తన ప్రకటనలో.. “మేము వ్యక్తిగత శాంతి, అభివృద్ధి మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ నిర్ణయం సులభం కాదు కానీ అవసరమైందని భావించాం” , “గతానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తు ప్రయాణానికి ఒకరికొకరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాకు ప్రైవసీ ఇచ్చినందుకు ధన్యవాదాలు” అని ఆమె తెలిపింది.
సైనా మరియు కశ్యప్ ఇద్దరూ హైదరాబాదులోని గోపీచంద్ అకాడమీలో కలిసి శిక్షణ పొందారు. సైనా ఒలింపిక్ కాంస్యంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థాయికి చేరగా, కశ్యప్ 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచారు. కశ్యప్ 2024 ప్రారంభంలో తన ఆట జీవితానికి ముగింపు పలికి, కోచింగ్ రంగంలో అడుగుపెట్టారు. ఇద్దరూ భారత బాడ్మింటన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
సైనా నెహ్వాల్, భారత బాడ్మింటన్ చరిత్రలో పలు రికార్డుల్ని సొంతం చేసుకున్న తొలి మహిళా క్రీడాకారిణి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలవడం, వరల్డ్ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌కి చేరడం, BWF వరల్డ్ జూనియర్ టైటిల్ గెలవడం వంటి ఘనతలతో భారత బాడ్మింటన్‌కు గ్లోబల్ గుర్తింపు తీసుకువచ్చారు. గత సంవత్సరం ఆమె ఆర్థరైటిస్ సమస్యలపై ఓ పోడ్కాస్ట్‌లో మాట్లాడారు. 2025 చివర్లో రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటానని సైనాని వ్యాఖ్యలు అప్పట్లో చర్చకు దారితీశాయి. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ఈ నిర్ణయం సైనా అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది.