47 ఏళ్ల తర్వాత రజనీ-కమల్ మల్టీస్టారర్
- Author : Vamsi Chowdary Korata
Date : 21-02-2026 - 2:30 IST
Published By : Hashtagu Telugu Desk
భారత సినీ అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నిజమైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ దాదాపు 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కలిసి వెండితెరపై కనిపించబోతున్నారు. ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో సంచలనం సృష్టించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చారిత్రక ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ‘KHxRK’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా అధికారికంగా ప్రకటించారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి శుక్రవారం అర్ధరాత్రి 12:07 గంటలకు మేకర్స్ ఓ ప్రోమోను విడుదల చేశారు. దాదాపు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో రజనీ, కమల్ ఇద్దరూ రెట్రో స్టైల్‌లో కనిపించి, తమదైన కామెడీ టైమింగ్, స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. ‘హీరో ఎవరు?’ అనే ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ ప్రమో ముగియడం అభిమానుల్లో అంచనాలను మరింత పెంచింది.
ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మిస్తుండగా, యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. ఇది హాస్యం, నాస్టాల్జియా, విజువల్స్ మేళవింపుతో కూడిన ఒక వినూత్న ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ప్రమో స్పష్టం చేస్తోంది.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది చివరికల్లా పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్ 2’, ‘తలైవర్ 173’ చిత్రాలతో బిజీగా ఉండగా, కమల్ హాసన్ ‘కల్కి 2898 AD’ సీక్వెల్.. ‘అన్బరివు’ వంటి ప్రాజెక్టులతో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు దిగ్గజాలు కలిసి నటిస్తుండటం భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.