Mohanbabu : దాడి చేయడం తప్పే.. మీడియాకు మోహన్ బాబు ఆడియో సందేశం
ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు, నాయకులు దీనిపై ఆలోచించాలని మోహన్ బాబు ఆ సందేశంలో కోరారు.
- By Latha Suma Published Date - 07:16 PM, Thu - 12 December 24

Mohanbabu : ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు మీడియాకు ఆడియో సందేశం విడుదల చేశారు. మీడియాపై దాడి చేస్తానని తాను ఎన్నడూ అనుకోలేదని ఆయన తెలిపారు. దాడి చేయడం తన తప్పేనని, తనను అర్థం చేసుకోవాలని మోహన్ బాబు కోరారు. జరిగిన ఘటననకు బాధపడుతున్నానన్న మోహన్ బాబు అన్నారు. ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు, నాయకులు దీనిపై ఆలోచించాలని మోహన్ బాబు ఆ సందేశంలో కోరారు.
మొదట తాను జర్నలిస్టుకు నమస్కారం పెట్టానని, అయినా అతను తన వద్ద మైక్ పెట్టారని తెలిపారు. ఆ మైక్ తన కన్నుకు తగలబోయిందని, తృటిలో తాను తప్పించుకున్నట్లు చెప్పారు. ఆ జర్నలిస్టు తనకు తమ్ముడులాంటి వారన్నారు. అన్ని విషయాలను పైన భగవంతుడు చూస్తున్నారని మోహన్ బాబు తెలిపారు. వందకు వంద శాతం కాకపోవచ్చు.. 95 నుంచి 96 శాతం కుటుంబాల్లో సమస్యల్లో ఉంటాయి. కొంత మంది ఉన్నవి లేనివి చెబుతూంటారు. ఇదంతా ప్రజలకు తెలుసు. ఇప్పుడు ప్రజలు కూడా.. రాజకీయ నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ ఇంట్లోకి వచ్చాడని, అది రైటా? రాంగా? చెప్పాలన్నారు. పత్రికా విలేకర్లు నాలుగు రోజుల నుంచి తన ఇంటి ముందు లైవ్ వ్యాన్ లు పెట్టుకుని ఉండటం ఎంతవరకూ సబని ఆయన ప్రశ్నించారు. తానుదండంపెట్టి చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఒక రాజ్యసభ సభ్యుడిగా తాను క్లీన్ చిట్ గా ఉన్నానని అన్నారు. తన హృదయంలో ఆవేదన చెప్పాలన్నారు. వచ్చిన వాళ్లు మీడియా వాళ్లా? వేరే వాళ్లా తెలియదని అని అన్నారు.
జర్నలిస్టులను కొట్టడం మాత్రం తప్పే అయినప్పటికీ.. సందర్భాన్ని అర్థం చేసుకోవాలని మోహన్‌బాబు తన ఆడియో సందేశంలో పేర్కొన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదన్నారు. మైకులు లాక్కుని కొట్టేంత మూర్ఖుడిని తాను కాదన్నారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, తాను చేసిన మంచి పనులను ఎవరూ అర్థం చేసుకోవడంలేదన్నారు. పోలీసులంటే తనకు ఎంతో ఇష్టమని, వారు శాంతి భద్రతలను కాపాడాలన్నారు. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని మోహన్‌బాబు తెలిపారు. ఇది న్యాయమా.. అన్యాయమా అనేది ఆలోచించాలన్నారు.
కాగా, తండ్రి కొడుకుల గొడవ కారణంగా మోహన్‌బాబు ఇంటి వద్ద న్యూస్ కవరేజ్ చేస్తున్న ఓ జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన సంచలనం రేపడంతో అసలు ఏం జరిగిందనే దానిపై మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. తన ఆడియో సందేశంలో పూర్తి వివరాలను మోహన్ బాబు వివరించారు.