Kollywood: కోలీవుడ్ ట్రెండింగ్.. క్రేజీ కాంబినేషన్ రిపీట్..?
- By HashtagU Desk Published Date - 11:51 AM, Wed - 9 February 22

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విజయ్ నటించిన సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలు సాధిస్తున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా విజయ్ నటించే చిత్రాల పై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నబీస్ట్ మూవీలో విజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తేరి, మెర్సల్, బిగిల్ చిత్రాలు భారీ విజయాలు సాధించడంతో బీస్ట్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ కాంబినేషన్‌లో మాస్టర్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ అంచానాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం పై మిక్స్‌డ్ టాక్ వచ్చినా, మంచి వసూళ్ళను సాధించింది. ఈ సినిమాలు విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్‌గా నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడి మరీ నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు మాస్టర్ మూవీ తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కాబోతుందనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు లోకేష్ కనగరాజ్ విజయ్ అండ్ విజయ్ సేతుపతిలకు కథను వినిపించగా, కథ నచ్చడంతో ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ నిర్మాతలలో ఒకరైన కలైపులి థాను నిర్మించనున్నారని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం విజయ్ బీస్ట్ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉండగా, ఆ తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం విజయ్ సినిమా చేయనున్నాడు. మరోవైపు లోకేష్ కనగరాజ్ కూడా విశ్వ నటుడు కమల్ హాసన్‌తో విక్రమ్ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.