Puri Jagannadh : హీరోలెవ్వరూ పూరి జగన్నాధ్ కు డేట్స్ ఇవ్వొద్దు.. లైగర్ తో నష్టపోయిన ఎగ్జిబిటర్ల దీక్ష..
గతంలోనే లైగర్ ఎగ్జిబిటర్లు పూరి మాకు న్యాయం చేయాలని, నష్టాన్ని చెల్లించాలని రచ్చ చేశారు. తాజాగా నేడు అకస్మాత్తుగా తెలంగాణ లైగర్ ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ వద్ద నిరాహార దీక్షకు దిగారు.
- By News Desk Published Date - 06:47 PM, Fri - 12 May 23

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన పూరి జగన్నాధ్(Puri Jagannadh) ఇటీవల విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో లైగర్(Liger) సినిమా తీసి భారీ డిజాస్టర్ చూశాడు. ఈ సినిమాతో పూరి నష్టపోవటమే కాక సినిమా కొన్న ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. దీంతో గతంలోనే ఎగ్జిబిటర్లు పూరి మాకు న్యాయం చేయాలని, నష్టాన్ని చెల్లించాలని రచ్చ చేశారు. గతంలో దీనిపై ఓ ఆడియో కాల్ కూడా వైరల్ అయింది. పూరి త్వరలోనే వాళ్లకు డబ్బులు కూడా ఇస్తానన్నాడు.
తాజాగా నేడు అకస్మాత్తుగా తెలంగాణ ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా పలువురు ఎగ్జిబిటర్లు మీడియాతో మాట్లాడుతూ.. దర్శకుడు పూరీ జగన్నాథ్ కు అగ్ర హీరోలెవరూ కాల్షిట్లు ఇవ్వొద్దని తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. పూరీ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందడంతో ఆ చిత్రాన్ని విడుదల చేసిన తమకు సుమారు 9 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి. ఆ సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎగ్జిబిటర్లను ఆదుకుంటానని, వారికి జరిగిన నష్టాన్ని ఆరు నెలల్లో తీరుస్తానని హామీ ఇచ్చి మరిచిపోయారు. అందుకే ఇవాళ ఇక్కడ లైగర్ బాధితుల సంఘం పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు దిగాము. లైగర్ చిత్ర విషయంలో బాధిత ఎగ్జిబిటర్లను పూరీ జగన్నాథ్ ఆదుకొని మాట నిలబెట్టుకోవాలి. అంతవరకు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ సహా ఇతర అగ్ర హీరోలెవరూ పూరీ జగన్నాథ్ కు కాల్షిట్లు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నాము అని అన్నారు.
దీనిపై లైగర్ నిర్మాతల్లో ఒకరైన ఛార్మి మెయిల్ ద్వారా ఎగ్జిబిటర్లకు సందేశాన్ని ఇచ్చింది. ఈ విషయం అంతా మాకు తెలుసు. గతంలోనే చెప్పాము. ఎగ్జిబిటర్లు అందరికి ఆ నష్టాన్ని తీర్చి మేలు జరిగేలా త్వరలోనే చూస్తాము అని తెలిపింది. దీంతో ఈ దీక్ష టాలీవుడ్ లో సంచలనంగా మారింది.
Also Read : Samantha-Vijay Love: సమంత అందాలకు విజయ్ దేవరకొండ ఫిదా, రీల్స్ వీడియో వైరల్