Katrina Kaif- Vicky Kaushal: తల్లిదండ్రులు కాబోతున్న కత్రినా కైఫ్- విక్కీ కౌశల్?!
ఇక సినిమాల విషయానికి వస్తే విక్కీ కౌశల్ చివరిగా 'ఛావా' అనే పీరియడ్ చిత్రంలో నటించారు. కత్రినా కైఫ్ విజయ్ సేతుపతితో కలిసి నటించిన 'మెర్రీ క్రిస్మస్' చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ఈ శుభవార్తపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- By Gopichand Published Date - 04:20 PM, Mon - 15 September 25

Katrina Kaif- Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ (Katrina Kaif- Vicky Kaushal) దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని ఎన్డీటీవీ వర్గాలు ధృవీకరించాయి. ఈ విషయాన్ని వారు ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కత్రినా గర్భవతి అని, అక్టోబర్-నవంబర్‌లో వారికి మొదటి బిడ్డ జన్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా కత్రినా గర్భం గురించి మీడియాలో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ జంట ఈ పుకార్లపై ఇప్పటివరకు మౌనంగానే ఉన్నారు. మీడియా దృష్టికి దూరంగా ఉంటున్న కత్రినా, బిడ్డ పుట్టిన తర్వాత కొంతకాలం సినిమా షూటింగ్‌ల నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తమ బిడ్డకు పూర్తి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఆమె మాతృత్వ విరామం తీసుకోవాలని అనుకుంటున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
గర్భంపై పుకార్లపై విక్కీ స్పందన
గతంలో ‘బ్యాడ్ న్యూజ్’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా విక్కీ కౌశల్‌ను కత్రినా గర్భం గురించి మీడియా ప్రశ్నించింది. దానికి విక్కీ తెలివిగా సమాధానం చెప్పారు. “మంచి వార్త గురించి అడిగితే (గర్భం గురించి) మేము మీ అందరితో పంచుకోవడానికి చాలా సంతోషిస్తాం. కానీ ప్రస్తుతానికి ఆ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదు” అని అన్నారు. అంతేకాకుండా “మీరు ఇప్పుడు ‘బ్యాడ్ న్యూజ్’ సినిమాను ఆస్వాదించండి. మంచి వార్త వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మీ అందరితో పంచుకుంటాము” అని తెలిపారు. ఈ సమాధానంతో విక్కీ ఆ వార్తలను ఖండించకపోయినా.. వాటికి స్పష్టత ఇవ్వడానికి నిరాకరించారు.
Also Read: Maoist Sujatha: ఆమె లొంగుబాటుతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలనుందా??
ప్రేమ బంధం, కెరీర్
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021లో రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా’లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం చాలా నిరాడంబరంగా, కేవలం వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. పెళ్లయిన తర్వాత ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తమ ప్రత్యేక సందర్భాల్లో ప్రేమ, సంతోషంతో కూడిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ వార్తతో వారి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. కత్రినా, విక్కీలకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే విక్కీ కౌశల్ చివరిగా ‘ఛావా’ అనే పీరియడ్ చిత్రంలో నటించారు. కత్రినా కైఫ్ విజయ్ సేతుపతితో కలిసి నటించిన ‘మెర్రీ క్రిస్మస్’ చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ఈ శుభవార్తపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.