Kangana Ranaut: ఫిల్మ్ ఫేర్ మ్యాగ్ జైన్ పై దావా వేస్తున్నా : కంగనా రనౌత్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరున్న హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
- By Naresh Kumar Published Date - 08:30 PM, Sun - 21 August 22

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరున్న హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫిల్మ్ ఫేర్ అవార్డులపై దావా వేయబోతున్నట్లు చెప్పింది. తను నటించిన ‘తలైవా’ చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఎంపికైనట్లు సమాచారం ఇచ్చిన ఫిల్మ్‌ఫేర్ నిర్వాహకులు.. అవార్డు అందుకోవాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన నటి.. తనదైన స్టైల్లో రియాక్ట్ అవుతూ నెట్టింట నోట్ షేర్ చేసింది. తాను 2014 నుంచి ఫిల్మ్ ఫేర్ వంటి అనైతిక, అవినీతి, అన్యాయం, పక్షపాత ధోరణితో అందించే అవార్డులను నిషేధించాననీ తెలిపింది. అయినా ఈ సంవత్సరం అవార్డు ఫంక్షన్‌కు హాజరు కావాలని తనకు కాల్స్ రావడం షాక్‌కు గురిచేసిందనీ చెప్పింది. ఇలాంటి దుర్మార్గపు పద్ధతులను ప్రోత్సహించడం వల్ల తన గౌరవం, విలువలు దిగజారిపోతాయనీ, అందుకే ఫిల్మ్ ఫేర్‌పై దావా వేయాలని నిర్ణయించుకున్నా. ధన్యవాదాలు అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.
బాలీవుడ్ లో నేపోటిజంపై పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ తన కామెంట్స్ తోనే తరచూ వార్తల్లో నిలుస్తోంది.
ఇటీవల స్టార్ హీరో అమీర్ ఖాన్ పైనా విమర్శలు గుప్పించింది.లాల్ సింగ్ చడ్డా చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను మ్యానేజ్ చేయడానికి మాస్టర్ మైండ్ అమీర్ ఖాన్ పన్నిన పన్నాగమిదని కంగన చెప్పుకొచ్చింది. గత కొంతకాలంగా బాలీవుడ్ లో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్న నేపథ్యంలో తన సినిమాను కాపాడుకోవడానికే అమీర్ ఈ జిమ్మిక్కులు చేస్తున్నారు అని వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ మ్యాగ్ జైన్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.