Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు
- Author : Vamsi Chowdary Korata
Date : 09-06-2026 - 4:41 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ నటి మంజరి ఫడ్నిస్ నివసిస్తున్న హౌసింగ్ సొసైటీలో ‘మైకీ’ అనే కమ్యూనిటీ కుక్కను కొందరు వ్యక్తులు రాడ్‌తో కొట్టి, గోనె సంచిలో కట్టేసి కాలువలో పడేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని చెప్తూ మంజరి సోషల్ మీడియాలో కన్నీరు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిద్రిస్తున్న మూగజీవిని అత్యంత కిరాతకంగా చంపేశారని, జంతువులపై ఇలాంటి క్రూరత్వానికి పాల్పడేవారు భయపడేలా సుప్రీంకోర్టు కఠిన చట్టాలు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మంజరి ఫడ్నిస్ తాజాగా వార్తల్లో నిలిచారు. ఆమె నివసిస్తున్న హౌసింగ్ సొసైటీలో ‘మైకీ’ అనే కమ్యూనిటీ డాగ్‌ను కొందరు వ్యక్తులు అత్యంత కిరాతకంగా కొట్టి, చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘాతుకాన్ని వివరిస్తూ నటి మంజరి సోషల్ మీడియా వేదికగా కన్నీరు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. జంతు ప్రేమికులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ అమానుష ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో మంజరి తన ఆవేదనను పంచుకుంటూ.. “ఈ వీడియో చేయాల్సిన అవసరం రాకపోయి ఉంటే బాగుండేది. కానీ ఈ నిజాన్ని అందరికీ చెప్పడం చాలా అవసరం. మా సొసైటీలో ‘మైకీ’ అనే కుక్క ఉండేది. దాన్ని దాని కుటుంబం వదిలేయడంతో 2019 నుంచి మా సొసైటీలోనే ఆశ్రయం పొందింది. అది ఎంతో మంచిది, అందరికీ ఇష్టమైన కుక్క. కొంతకాలం క్రితం అది హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో మేమంతా చాలా ఆందోళన చెందాం. పోస్టర్లు వేయించాం, అన్ని చోట్లా వెతికాం, సెక్యూరిటీ గార్డులతో మాట్లాడాం. కానీ ఎలాంటి సమాచారం దొరకలేదు” అని తెలిపారు.
అయితే చివరికి తాజాగా ఒక వ్యక్తి నిజం చెప్పడంతో అసలు దారుణం బయటపడింది. మైకీ బిల్డింగ్ బేస్మెంట్ వద్ద ప్రశాంతంగా నిద్రపోతుండగా, కొంతమంది నేర మనస్తత్వం ఉన్న వ్యక్తులు దాని తలపై కర్రతో లేదా ఇనుప రాడ్‌తో బలంగా కొట్టారు. ఆ దెబ్బకు అది తీవ్రంగా గాయపడి, దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోగా.. దాన్ని మెట్ల ప్రాంతానికి ఈడ్చుకెళ్లి మరింత విచక్షణారహితంగా కొట్టారు. ఆ దారుణ హింస వల్ల దాని నోటి నుంచి రక్తం కారింది. ఆపై అది ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న స్థితిలోనే ఒక గోనె సంచిలో మూటకట్టి, వెనుక ఉన్న కాలువ ప్రాంతంలో పడేశారు. ప్రస్తుతం తాము దాని మృతదేహం కోసం వెతుకుతున్నామని మంజరి కన్నీళ్లు పెట్టుకుంది.
ఈ సందర్భంగా మంజరి ఫడ్నిస్ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. జంతువులపై జరుగుతున్న ఇలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం చట్టాల్లో ఉన్న లొసుగుల వల్ల, కొంతమంది తమకు నచ్చని కుక్కలను ఇలాంటి అక్రమ మార్గాల్లో అంతమొందించేందుకు భయపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఏ సొసైటీలోనూ, ఏ మూగజీవిపై ఇలాంటి దారుణం జరగకూడదని, జంతువులకు హాని చేయాలంటేనే ప్రజలు వణికిపోయేలా శిక్షలు ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
మంజరి ఫడ్నిస్ టాలీవుడ్లో పలు వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. 2008లో అల్లరి నరేష్ సరసన “సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం” సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ఆమె, ఆ తర్వాత 2010లో మళ్లీ నరేష్‌తో కలిసి దర్శకుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన “శుభప్రదం” చిత్రంలో అలరించారు. అదే ఏడాది విడుదలైన “ఇంకోసారి” చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లోనూ మంజరి మెరిశారు. 2011లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన హై-బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘శక్తి’ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించి పాపులారిటీ సంపాదించుకున్నారు.