Tollywood : రేపటి నుండి సినిమా షూటింగ్స్ బంద్..ఫెడరేషన్ నాయకుల డిమాండ్స్ ఇవే !!
Tollywood : ఆగస్టు 4, 2025 (రేపటి) నుండి షూటింగ్‌లు నిలిచిపోనున్నాయి. తమకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ నాయకులు ఈ సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు
- By Sudheer Published Date - 07:16 PM, Sun - 3 August 25

నానా కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న టాలీవుడ్(Tollywood)కు మరో భారీ షాక్ తగిలింది. వరుస ప్లాపులు, ఓటీటీ ప్రభావంతో నిర్మాతలు (Producers) తీవ్ర నష్టాలను చవిచూస్తున్న తరుణంలో, ఇప్పుడు ఫెడరేషన్ నాయకులు సినిమా షూటింగ్‌ల బంద్‌కు (Shootings Bandh) పిలుపునిచ్చారు. ఆగస్టు 4, 2025 (రేపటి) నుండి షూటింగ్‌లు నిలిచిపోనున్నాయి. తమకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ నాయకులు ఈ సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం టాలీవుడ్‌లో ఆందోళన కలిగిస్తోంది.
ఫెడరేషన్ నాయకుల ప్రధాన డిమాండ్లు ఏమిటంటే.. ప్రస్తుతం ఉన్న వేతనాలపై 30 శాతం పెంపుదల కావాలని కోరుతున్నారు. అంతేకాకుండా, పెంచిన వేతనాలను కూడా ఎప్పటికప్పుడు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ డిమాండ్లను నిర్మాతలు అంగీకరించేంత వరకు తమ సభ్యులు ఎవరూ షూటింగ్‌లకు హాజరుకారని ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈ సమ్మె వల్ల సినిమా నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
AP liquor Scam : లిక్కర్ స్కాంలో సంపాదించింది డబ్బు కాదు.. ప్రజల రక్త మాంసాలు
ఈ సమ్మె ప్రభావం కేవలం తెలుగు సినిమాలపైనే కాకుండా, ఇతర భాషల వెబ్ సిరీస్‌లు, చిత్రాలపైనా ఉంటుందని ఫెడరేషన్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఇతర భాషా చిత్రాలు, వెబ్ సిరీస్‌లకు కూడా ఈ బంద్ వర్తిస్తుందని ప్రకటనలో తెలిపారు. ఇది సినీ పరిశ్రమపై విస్తృత ప్రభావాన్ని చూపనుంది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమకు ఇది మరింత భారంగా మారనుంది.
నిర్మాతలు మరియు ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు ఎప్పుడు జరుగుతాయి, ఈ సమ్మెకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఇప్పటికే వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో నిర్మాణంలో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ బంద్ వల్ల నిలిచిపోనున్నాయి. ఈ పరిస్థితి ఎప్పటికి సద్దుమణుగుతుందో, సినీ పరిశ్రమ సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.