Tollywood Casting couch: టాలీవుడ్లో హీరోయిన్లపై మళ్లీ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం.
- Author : Vamsi Chowdary Korata
Date : 04-04-2026 - 11:19 IST
Published By : Hashtagu Telugu Desk
Piku Nemali టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులపై నటి పూనమ్ కౌర్ మరోసారి గళమెత్తారు. ఇటీవల ఎన్నారై ఇన్ఫ్లుయెన్సర్ పికు నెమలి ఒక నిర్మాతపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు పూనమ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “తెలుగు పరిశ్రమలో సావిత్రి, జయప్రద, సౌందర్య వంటి గొప్ప నటీమణులు ఇప్పుడు ఎందుకు లేరో చెప్పడానికి బలమైన కారణం ఉంది. ఎంతో ప్రతిభ, అందం ఉన్న తెలుగు అమ్మాయిలను నేను కలిశాను, కానీ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల వల్లే వారు రాణించలేకపోతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి ‘క్యాస్టింగ్ కౌచ్’ సెగలు రేగుతున్నాయి. సినిమా అవకాశాల పేరుతో నటీమణులను లోబరుచుకోవాలని చూసే చీకటి కోణాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఎన్నారై యువతి చేసిన ఆరోపణలు పరిశ్రమలో పెను సంచలనం సృష్టించాయి. ఈ వివాదంపై ఫైర్ బ్రాండ్ నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగు మూలాలున్న ఇన్ఫ్లుయెన్సర్ ‘పికు నెమలి’ (Piku Nemali) సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక నిర్మాత తనను సినిమా అవకాశాల సాకుతో వేధించారని ఆమె ఆరోపించారు. సదరు నిర్మాత తనను కలిసేందుకు ఒక రిసార్ట్‌కు రమ్మని ఒత్తిడి చేశారని, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ స్థాయిలో ఉందో వివరిస్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
అందుకే సావిత్రి, సౌందర్యలు లేరు – పూనమ్ కౌర్
మహిళల సమస్యలపై సోషల్ మీడియా వేదికగా గళమెత్తే పూనమ్ కౌర్ ఈ వీడియోపై అత్యంత ఘాటుగా స్పందించారు. “తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సావిత్రి గారు, జయప్రద గారు, భానుప్రియ, శ్రీదేవి, సౌందర్య వంటి గొప్ప నటీమణులు ఎందుకు లేరో చెప్పడానికి బలమైన కారణం ఉంది. నేను వ్యక్తిగతంగా కలిసిన ఎంతోమంది తెలుగు నటీమణులు అద్భుతమైన అందం, నైపుణ్యం కలిగి ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల కారణంగానే వారికి సరైన గుర్తింపు రావడం లేదు. ఇది అక్షర సత్యం” అంటూ పూనమ్ పేర్కొన్నారు.
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక నిరంతర సమస్యగా మారింది. అవకాశాల కోసం నటీమణులను లైంగికంగా వేధించడం, లొంగిపోవాలని కోరడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యల సారాంశం ఏమిటంటే.. ప్రతిభ ఉన్న తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలని ఆశపడినా, ఇలాంటి వేధింపుల వల్లే వారు వెనకడుగు వేస్తున్నారని లేదా దూరం పెట్టబడుతున్నారని ఆమె పరోక్షంగా హెచ్చరించారు. గతంలో కూడా పూనమ్ కౌర్ పలువురు అగ్ర దర్శకులను, నిర్మాతలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎన్నారై యువతికి మద్దతు తెలపడం ద్వారా, పరిశ్రమలో వేధింపులకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని ఆమె మరోసారి స్పష్టం చేశారు.

Ponnam Kaur Tweet