Serial Actress Swapna: ఇండస్ట్రీలో కుల వివక్ష? సీరియల్ నటి స్వప్న ఆవేదన
- Author : Vamsi Chowdary Korata
Date : 21-03-2026 - 3:27 IST
Published By : Hashtagu Telugu Desk
Chelly Swapna చెల్లి స్వప్న అలియాస్ స్వప్న అంటే తెలియని వాళ్లు సీరియల్ ప్రేక్షకుల్లో ఉండరు. గత రెండు దశాబ్దాలుగా ఎన్నో సీరియల్స్‌లో నటించి మెప్పించింది స్వప్న. తాజాగా పొదరిల్లు సీరియల్లో కనిపిస్తున్న స్వప్న అంతకు ముందు గృహలక్ష్మి, అమృతం, మనసు మమత, చంద్రముఖి, ఉమ్మడి కుటుంబం, తూర్పు వెళ్లే రైలు ఇలా అనేక సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. ముఖ్యంగా నెగిటివ్ రోల్స్‌కి అయితే స్వప్న పెట్టింది పేరు.
సీరియల్స్ అంటే ఆయా పాత్రల్లో వాళ్లని చూసుకుంటూ ఉంటారు కాబట్టే ప్రేక్షకులు ఈ సీరియల్స్‌లో నిమగ్నమైపోతుంటారు. వాస్తవ జీవితాలకు దగ్గరగా ఉంటాయి కాబట్టే సీరియల్స్‌కి అంతటి ఆదరణ. ఏదైనా భరించలేని కష్టం వస్తే.. ఆమెకి సీరియల్ కష్టాల్రా బాబూ అని అంటుంటారు. అంటే ఆమెకి అన్ని కష్టాలన్నమాట. రీల్ లైఫ్‌లో సీరియల్ కష్టాలను అనుభవించేవాళ్లు.. వాళ్ల రియల్ లైఫ్‌లో అంతకుమించే అనుభవిస్తుంటారు. పైకి కనిపించే రంగుల ప్రపంచాన్ని దాటి.. నిజ జీవితంలో ఎన్నో ఛాలెంజ్‌లను చూస్తుంటారు. అలా గత కొన్నేళ్లుగా టీవీ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటి స్వప్న అలియాస్ చెల్లి స్వప్న తన జీవితంలో ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితుల్ని కళ్లకి కడుతూ కన్నీటిపర్యంతం అయ్యింది.
తనని ఆదరిస్తారని రైటర్స్ అసోషియేషన్‌లో చేరితే.. తనపై వ్యభిచారి అనే ముద్ర వేశారంటూ కన్నీటిపర్యంతం అయ్యింది స్వప్న. ప్రస్తుతం పొదరిల్లు సీరియల్లో నటిస్తున్న స్వప్న.. చాలా ఏళ్లుగా టీవీ ఇండస్ట్రీలో ఉంటూ.. అమృతం, గృహలక్ష్మి, ఉమ్మడి కుటుంబం, తూర్పు వెళ్లే రైలు, మనసు మమత, చంద్రముఖి ఇలా చాలా సీరియల్స్‌లో నటించిన స్వప్న తన రియల్ కష్టాలను చెప్పుకుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…
వాళ్ల అవసరం కోసం వాళ్లు రైటర్స్ అసోషియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో నవలలు, షార్ట్ ఫిల్మ్స్ రాసేవాళ్లందరినీ ఒకటి చేసి అసోషియేషన్‌ని ఏర్పాటు చేశారు. అందులో నాకు సభ్యత్వం ఇచ్చారు. వాళ్లు ఇచ్చారు నేను తీసేసుకున్నానంతే.. దాని గురించి నాకు పెద్దగా ఏం తెలియదు. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. అది ఎంత పెద్ద తప్పు అంటే ఆ రైటర్స్ అసోషియేషన్‌లో నన్ను వ్యభిచారి అని అన్నారు. అదే రైటర్స్ నన్ను కులం తక్కువది అని అన్నారు. ఆ అసోసియేషన్‌లో నాకు గౌరవం దక్కిందా లేదా అంటే అది భగవంతుడికే తెలియాలి.
ఎంత నరకం చూడాలో అంత నరకం చూసేశాను. వాళ్ల మాటల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధం అయ్యాను. ఇప్పటికీ కూడా నేను మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాను. ఈ డిప్రెషన్లో నేను చనిపోయినా.. ఎవరైనా చింపేసినా అది రైటర్స్ అసోషియేషన్ వల్లే అవుతుంది. ఖచ్చితంగా వాళ్లవల్లే అని చెప్పగలను. ఆ అసోషియేషన్‌కి చాలా మంచి వ్యక్తే ప్రెసిడెంట్. కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది తప్పు అని ఖండించడు ఆయన. ఎవరైనా ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడితే అది తప్పు అని చెప్పడు ఆయన. ఎంకరేజ్ చేస్తాడు ఇంకా. అది కరెక్ట్ కాకపోతే వాళ్లు అలా అని ఉండరు కదా అని అంటారు. నేను నీతిమంతురాల్ని.. నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్పడం లేదు. కానీ అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది.
రైటర్స్ అసోషియేషన్స్‌లో విజయ్ కుమార్ అని రియల్ ఎస్టేట్ చేసేవారు. ఆయన ఓ వందమంది పేద ఆర్టిస్ట్‌లకు ఇళ్ల స్థలాలు ఫ్రీగా ఇస్తాను.. ఒక్కో క్రాఫ్ట్ నుంచి ఐదుగురు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి.. దానికి టీవీ నగర్ పేరు పెడతానని ప్రకటన చేశారు. దానికి ఫిల్మ్ ఛాంబర్లో చాలా పెద్దగా గ్రాండ్ ఓపెనింగ్ చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో పాటు చాలామంది వచ్చారు. ఒక్కో క్రాఫ్ట్ నుంచి ఐదుగురు అంటే అందులో రైటర్స్ అసోషియేషన్ కూడా ఉంటుంది కదా. అందులో ఐదుగురు అంటే.. నా పేరు ప్రకటించారు. పాపం ఆ అమ్మాయి చాలా ఏళ్లుగా ఉంది. ఫైనాన్షియల్‌గా కూడా ఏం సంపాదించలేదు. బాగా కష్టపడుతుంది.. స్వప్న పేరు రాద్దాం’ అని అన్నారు. ఆ స్థలం ఎక్కడో ఊరు చివర. అది మహా అయితే లక్షో లక్షన్నరో వాల్యూ చేస్తుందని కూడా అన్నారు.
నా పేరు చెప్పడం అందరికీ ఆమోదయోగ్యమేనా అని అందర్నీ అడిగారు. వీళ్లంతా పేదలు అంటూ స్టేజ్ మీదికి పిలిచారు. ఆ టైమ్‌లో మా అమ్మ చనిపోవడంతో నేను చాలా బాధలో ఉన్నాను. కోవిడ్ టైమ్ కాబట్టి మాస్క్ పెట్టుకుని ఉన్నాను. కానీ స్టేజ్‌పై మాస్క్ తీయించారు. ఫ్రీగా అంటే తీసుకోవడానికి వచ్చేశావ్ కానీ.. మొహం చూపించాలంటే నామోషీనా? మాస్క్ తియ్.. పేద దానివి అని తెలియకూడదా అంటూ స్టేజ్‌పై మాస్క్ తీయించారు. అది జరిగి ఐదేళ్లు అవుతుంది.. ఇప్పటికీ ఆ స్థలం నాకు ఇవ్వలేదు.
ఇవ్వకపోగా.. ఆ స్వప్నకి స్థలం ఎందుకు ఇచ్చారు. ఆ విజయ్ కుమార్‌తో సంబంధం ఉందా? లేదంటే అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్‌తో సంబంధం ఉందా? వాళ్లిద్దరితో తప్పుడు పనులు చేస్తేనే స్థలం రాసిచ్చారేమో అని డైరెక్ట్‌గా అసోసియేషన్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టారు. దానికి గ్రూప్‌లో ఉన్న 150 మంది సపోర్ట్ చేశారు. అది నాకు చాలా బాధ వేసింది. నేను తప్పు చేసేదాన్నే అయితే.. ఎక్కడో ఊరి చివరి ఇచ్చే లక్ష రూపాయిల స్థలం కోసం ఎందుకు తప్పు చేయాలి? అలాంటి తప్పుడు పనులు చేసేదాన్నే అయితే ఇంతవరకూ ఎందుకు? నేను నాలుగైదేళ్లకే సెటిల్ అయిపోయేదాన్ని కదా. నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. యంగ్ స్టార్‌గా ఇండస్ట్రీకి వచ్చాను.. తప్పుడు పని చేసి సెటిల్ అవ్వాలనుకుంటే.. ఆరోజే తప్పు చేసేదాన్ని కదా.. అప్పుడే సెటిల్ అయ్యేదాన్ని కదా.
నా గురించి గ్రూప్‌లో అంత దారుణంగా మాట్లాడుతున్నారని.. మా అసోషియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ సురేశ్ గారికి ఫోన్ చేసి నా గురించి దారుణంగా మాట్లాడుతున్నారు సార్.. నేను ఎక్కడ వ్యభిచారం చేశానో చెప్పండి. మీతో కానీ.. ఆయనతో కానీ నేను తప్పు చేసి ఉంటే చెప్పండి. నాకు ఎక్కడ ల్యాండ్ ఇచ్చారో చెప్పండి. నా వృత్తి వ్యభిచారం అని డిక్లేర్ చేసేశారు కదా.. చెప్పండీ నేనేం తప్పు చేశానో.. నేను తప్పు చేస్తే నిరూపించండి.. లేదంటే వాళ్లు అలా మాట్లాడటం తప్పని అయినా చెప్పండి అని అడిగాను.
దానికి ఆయన.. ‘ఎప్పుడు మాట్లాడాలో నాకు తెలుసు.. నేను ఇప్పుడు మాట్లాడను’ అని అన్నారు. అలా మాట్లాడటం తప్పు అని ఒక్కరు కూడా ఖండించలేదు. దానికి నేనేం ఫీల్ కావడం లేదు.. కృంగిపోవడం లేదు. ఎందుకంటే నా దేవుడు నాకు ఇవ్వాల్సిన బలాన్నిస్తాడు. వాళ్లు అన్నంత మాత్రాన నేనేం చెడిపోలేదు. చెడిపోను కూడా. నాకు వ్యభిచారం అలవాటు లేదు. దాని కారణంగా నాకు స్థలం ఇవ్వలేదు. ఒక అసోషియేషన్ తరుపున నాకు వచ్చిన ఘనత అదే.
ఇప్పటికీ అంటారూ.. స్వప్నకి కృతజ్ణత లేదు.. ఆయన ఎప్పుడో అన్న మాటనే పట్టుకుంటుంది అని అంటారు. నేను ఈ రైటర్స్ అసోషియేషన్ పెద్దాయన దగ్గర రెండు ప్రాజెక్ట్‌లు చేశాను. కొమరం భీం, చాకలి ఐలమ్మ ఈ రెండు చేశాను. కొమరం భీం నేను చేయాల్సిన ప్రాజెక్ట్ కాదు.. వేరే కన్నడ అమ్మాయిని తీసుకున్నారు. కానీ తెల్లవారితే షూటింగ్ అనగా.. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. అప్పుడు నాకు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫోన్ చేశారు. నువ్వు అర్జెంట్‌గా బయల్దేరి రావాలి.. అని మేనేజర్ ఫోన్ చేశారు. అది నాగబాల సురేష్ గారి ప్రొడక్షన్ అని కూడా తెలియదు.. తెలిసిన తరువాత తెలిసింది’ అంటూ తన బాధల్ని చెప్పుకొచ్చింది సీరియల్ నటి స్వప్న.
Tags
- Actress Allegations
- Actress Emotional Comments
- Caste Controversy
- caste discrimination
- Celebrity Controversy
- Chelly Swapna
- Chelly Swapna News
- Entertainment News Telugu
- Serial Actress Swapna
- Swapna Controversy
- Telugu Actress News
- Telugu Serial Actress News
- Telugu Serial News
- Telugu TV News
- Tollywood Controversy
- tollywood news
- Trending News Telugu
- TV Industry Issues
- Viral News Telugu