షాకింగ్.. జొమాటో నుండి ప్రతి నెలా 5,000 మంది తొలగింపు!
డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని చాలా మంది ఒక తాత్కాలిక పనిగా భావిస్తారని దీపిందర్ పేర్కొన్నారు. అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు ఈ పనిని ఎంచుకుంటారని, అవసరమైనంత సంపాదించాక పని మానేస్తారని ఆయన చెప్పారు.
- Author : Gopichand
Date : 04-01-2026 - 9:15 IST
Published By : Hashtagu Telugu Desk
Zomato: జొమాటో మాతృ సంస్థ ‘ఎటర్నల్’ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ తమ కంపెనీ ఫుడ్ డెలివరీ విభాగం నుండి ప్రతి నెలా సుమారు 5,000 మంది గిగ్ వర్కర్లను (డెలివరీ పార్ట్నర్లు) తొలగిస్తున్నట్లు వెల్లడించారు. యూట్యూబర్ రాజ్ శమానీ పాడ్‌కాస్ట్‌లో ఆయన ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
లక్షల సంఖ్యలో స్వచ్ఛందంగా తప్పుకుంటున్న వర్కర్లు
ఉద్యోగాల నుండి తొలగించడమే కాకుండా ప్రతి నెలా సుమారు 1.5 లక్షల నుండి 2 లక్షల మంది గిగ్ వర్కర్లు స్వచ్ఛందంగా పని వదిలిపెట్టి వెళ్తున్నారని దీపిందర్ తెలిపారు. అదే సమయంలో కంపెనీ ప్రతి నెలా సుమారు 1.5-2 లక్షల మంది కొత్తవారిని విధుల్లోకి తీసుకుంటోంది. గత త్రైమాసికం వరకు ఎటర్నల్ గ్రూప్‌లో ఫుడ్ డెలివరీ అతిపెద్ద వ్యాపారంగా ఉండేది. కానీ ఇప్పుడు దాని క్విక్ కామర్స్ విభాగం ‘బ్లింకిట్’ దీనిని అధిగమించింది. అయినప్పటికీ గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసే జొమాటో ఇప్పటికీ కంపెనీకి ప్రధాన లాభదాయక ఇంజిన్‌గా కొనసాగుతోంది.
Also Read: చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు!
భారీ స్థాయిలో తొలగింపులకు కారణాలు
డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని చాలా మంది ఒక తాత్కాలిక పనిగా భావిస్తారని దీపిందర్ పేర్కొన్నారు. అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు ఈ పనిని ఎంచుకుంటారని, అవసరమైనంత సంపాదించాక పని మానేస్తారని ఆయన చెప్పారు. ఇకపోతే కంపెనీ కొంతమందిని తొలగించడానికి ప్రధాన కారణం మోసపూరిత చర్యలే అని ఆయన స్పష్టం చేశారు. ఉదాహరణకు ఆహారాన్ని డెలివరీ చేయకపోయినా చేసినట్లు చూపించడం. క్యాష్-ఆన్-డెలివరీ ఆర్డర్ల సమయంలో కస్టమర్లకు ఇవ్వాల్సిన మిగిలిన చిల్లర డబ్బును ఇవ్వకుండా మోసం చేయడం వంటి ఫిర్యాదుల వల్ల వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గిగ్ వర్కర్లకు పూర్తిస్థాయి ఉద్యోగుల మాదిరిగా పీఎఫ్ (PF) లేదా గ్యారెంటీ జీతం ఇవ్వాలనే డిమాండ్లు ఈ బిజినెస్ మోడల్‌కు సరిపడవని దీపిందర్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే డెలివరీ పార్ట్నర్లకు నిర్దిష్టమైన షిఫ్ట్ సమయాలు ఉండవు. వారు ఎప్పుడు లాగిన్ అవ్వాలి, ఎప్పుడు లాగ్-అవుట్ అవ్వాలి అనేది వాళ్లే నిర్ణయించుకుంటారు. నగరంలో ఏ ప్రాంతంలో డెలివరీ చేయాలనేది కూడా వారి ఇష్టానికే వదిలేస్తారు. ఈ తరహా స్వేచ్ఛ ఉన్నప్పుడు వారిని సాధారణ ఉద్యోగులుగా పరిగణించడం కష్టమని ఆయన వివరించారు.