Zomato : రైల్వేశాఖతో జొమాటో ఒప్పందం.. 100కుపైగా రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ
ఇప్పటికే తాము రైలు ప్రయాణికులకు 10 లక్షలకుపైగా ఆర్డర్లను డెలివరీ చేశామని.. రానున్న రోజుల్లో తమ డెలివరీ సామర్థ్యం మరింత పెరుగుతుందని జొమాటో(Zomato) సీఈవో ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
- By Pasha Published Date - 02:16 PM, Sat - 14 September 24

Zomato : ట్రైన్ జర్నీలో ఫ్యాన్సీ ఫుడ్ తినాలని భావించే వారికి గుడ్ న్యూస్. ఇక నుంచి రైలులో పాత తరం వంటకాలను తింటూ అడ్జస్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. రైలు ప్రయాణికులు ఇక జొమాటో ద్వారా ఫుడ్ కోసం ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. దీనికి సంబంధించి రైల్వేశాఖకు చెందిన ఐఆర్‌సీటీసీతో జొమాటో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి ‘జొమాటో – ఫుడ్ డెలివరీ ఇన్ ట్రైన్స్’ అనే పేరు పెట్టారు. ఈవివరాలను ఎక్స్ వేదికగా జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ వెల్లడించారు. దేశంలోని 100కుపైగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఇక నేరుగా జొమాటో ఫుడ్ డెలివరీ చేయనుందని ఆయన తెలిపారు. ఈమేరకు ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇప్పటికే తాము రైలు ప్రయాణికులకు 10 లక్షలకుపైగా ఆర్డర్లను డెలివరీ చేశామని.. రానున్న రోజుల్లో తమ డెలివరీ సామర్థ్యం మరింత పెరుగుతుందని జొమాటో(Zomato) సీఈవో ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Also Read :PM Modis Family : దీప్ జ్యోతిని ముద్దాడిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్
జొమాటో సీఈవో పోస్ట్‌పై నెటిజన్లు పెద్దఎత్తున స్పందించారు. ‘‘మనదేశంలో రైళ్లు లేటుగా నడుస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు ? మీ డెలివరీ బాయ్ ఏం చేస్తారు ?’’ అని కొందరు నెటిజన్స్ ప్రశ్నించారు. ‘‘ట్రైనులోని ప్రయాణికులు పెట్టే ఆర్డర్లకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ తప్పకుండా అందుబాటులో ఉండాలి’’ అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.
Also Read :Chetan Bhagat : నేను బొప్పాయి లాంటోణ్ని.. ఎవరేమన్నా డోంట్ కేర్ : చేతన్ భగత్
ఒకవేళ డెలివరీ బాయ్ లేట్ వచ్చినా.. ట్రైన్‌లోని బోగీని క్యాచ్ చేయడంలో డెలివరీ బాయ్ కన్ఫ్యూజ్ అయినా ప్రయాణికుడికి లబ్ధి చేకూరాలంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ తప్పనిసరి అని ఇంకో నెటిజన్ పేర్కొన్నారు. దీనిపై ఐఆర్‌సీటీసీ కూడా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. ఇప్పటికే దేశంలోని 8 నగరాల్లో జొమాటో – ఫుడ్ డెలివరీ ఇన్ ట్రైన్స్ సేవలు మొదలయ్యాయని గుర్తుచేసింది. 100 రైల్వేస్టేషన్ల పరిధిలో ఇప్పటికే 10 లక్షల మంది రైలు ప్రయాణికులకు ఇప్పటికే జొమాటో ఫుడ్‌ను డెలివరీ చేసిందని తెలిపింది.