Three Encounters : ప్రధాని పర్యటన వేళ మూడు ఎన్‌కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
బారాముల్లా జిల్లా, కిష్త్వార్ జిల్లా, అనంత్ నాగ్ జిల్లాలలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను(Three Encounters) భారత సైన్యం మట్టుబెట్టింది.
- By Pasha Published Date - 12:36 PM, Sat - 14 September 24

Three Encounters : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించాయి. ఈ తరుణంలో ఉగ్రవాదులు పేట్రేగారు. మూడుచోట్ల భద్రతా బలగాలపై దాడికి తెగబడ్డారు. అయితే వారిని భారత సైన్యం, భద్రతా బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయి. బారాముల్లా జిల్లా, కిష్త్వార్ జిల్లా, అనంత్ నాగ్ జిల్లాలలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను(Three Encounters) భారత సైన్యం మట్టుబెట్టింది. అయితే కిష్త్వార్ జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. అమరులైన సైనికులను నాయబ్ సుబేదార్ విపన్ కుమార్, సిపాయి అరవింద్ సింగ్‌లుగా గుర్తించారు. మరో ఇద్దరు ఆర్మీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఆర్మీకి చెందిన రైజింగ్ స్టార్ కార్ప్స్ యూనిట్ శుక్రవారం కథువాలో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపింది. జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా చక్ తాపర్ క్రీరీ పట్టన్ ఏరియాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Also Read :Port Blair : ‘పోర్ట్ బ్లెయిర్’కు ఆ పేరు ఎలా వచ్చింది ? బ్లెయిర్ ఎవరో తెలుసా ?
జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి సరిగ్గా కొన్ని గంటల ముందే పెద్దసంఖ్యలో ఎన్‌కౌంటర్లు జరగడం గమనార్హం. ఈ ఎన్‌కౌంటర్లు జరిగిన ప్రాంతాల్లో తొలి విడతలోనే (సెప్టెంబరు 18) పోలింగ్ జరగబోతుండటం గమనార్హం. తొలి విడతలో ఓట్ల పండుగ జరగనున్న జిల్లాల జాబితాలో దోడా, కిష్త్వార్, రాంబన్ ఉన్నాయి. వాటి పరిధిలోని 8 అసెంబ్లీ స్థానాల్లో ఈనెల 18న పోలింగ్ జరుగుతుంది. వీటితో పాటు అనంత్ నాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్ జిల్లాలలోని అసెంబ్లీ స్థానాల్లోనూ ఈనెల 18నే ఓటింగ్‌ను నిర్వహిస్తారు. జమ్మూ, కథువా, సాంబా జిల్లాలలో ఈనెల 25న, అక్టోబరు 1న పోలింగ్ జరుగుతుంది. గత 42 ఏళ్లలో దేశ ప్రధాని దోడా జిల్లాలో పర్యటించడం ఇదే తొలిసారి.