SIP Investments : పదేళ్లలో రూ.కోటి కావాలా? నెలకు ఎంత సిప్ చేయాలో తెలుసా..!
- By Vamsi Chowdary Korata Published Date - 11:16 AM, Thu - 4 December 25
మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ రన్‌లో మంచి రిటర్న్స్ వస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు. చాలా వరకు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ సగటున వార్షిక ప్రాతిపదికన 12 శాతానికి మించి రాబడి ఇచ్చేవి చాలానే ఉంటాయి. ఇప్పుడు పదేళ్లకు మీకు రూ. కోటి కావాలంటే.. నెలకు ఎంత సిప్ చేయాలి.. ఎంత శాతం వార్షిక రాబడి ఆశించాలో చూద్దాం.
సంపాదించే వయసులో ఖర్చులకు ఏ లోటూ ఉండదు. అన్ని అవసరాలు తీరతాయి. కుటుంబం బాగానే ఉంటుంది. అయితే.. ఒక్కసారిగా ఉన్నట్లుండి ఉద్యోగం పోతే పరిస్థితేంటి.. రిటైర్మెంట్ తర్వాత డబ్బులు సంపాదించలేని వయసులో ఎలా.. స్థిర ఆదాయం లేదా నెలనెలా జీతం లేకుండా ఎలా జీవనం సాగిస్తారు. ఇవన్నీ కచ్చితంగా ఆలోచించాల్సిందే. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ.. పొదుపు చేస్తూ ఉండాలి. దీనిని పెట్టుబడులు చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు అందుకోవచ్చు. కొన్నేళ్లలో మంచి రాబడి రావాలంటే.. స్థిరంగా ఇన్వెస్ట్ చేస్తూ పోవాల్సి ఉంటుంది. ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఇన్వెస్ట్ చేయాలని ఆర్థిక నిపుణులు ప్రోత్సహిస్తుంటారు.
ఇక్కడ కూడా లంప్ సమ్ (ఒకేసారి పెట్టుబడి) కంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) విధానంలో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. దీని ద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతున్న కొద్దీ.. దానికి మించే రాబడి అందిస్తుందని చెబుతుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగానే ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు. దీని ద్వారానే దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ పొందుతుంటారు.
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల విషయానికి వస్తే.. ఇక్కడ సిప్ విధానంలో మనం నెలనెలా ఎంత మొత్తం సిప్ చేస్తే.. ఎంత కాలంలో ఎంత శాతం వార్షిక రాబడి చొప్పున ఎంత రిటర్న్స్ పొందగలరో అంచనా వేయొచ్చు. ఇది తెలుసుకునేందుకు మనకు ఆన్‌లైన్ కాలిక్యులేటర్స్ అందుబాటులో ఉంటాయి. చాలా వరకు మ్యూచువల్ ఫండ్లలో వార్షికంగా 12 శాతానికి మించి రాబడి ఇచ్చినవి చాలానే ఉన్నాయి. ఎంత శాతం రాబడికి ఎంత రిటర్న్స్ వచ్చాయో చూద్దాం.
మీరు ఉదాహరణకు రాబోయే పదేళ్లలో రూ. 1 కోటి టార్గెట్ పెట్టుకున్నారనుకుందాం. అప్పుడు 9,10, 11, 12 ఇలా ఎంత వార్షిక రాబడితో.. నెలకు సిప్ ఎంత చేయాలనేది తెలుసుకుందాం. ఇక్కడ తక్కువ సిప్ మొత్తం పెడితే.. అక్కడ రిటర్న్స్ ఎక్కువగా ఉండాలి. అదే విధంగా రిటర్న్స్ తక్కువగా ఉంటే సిప్ ఎక్కువ చేయాల్సి వస్తుందని తెలుసుకోవాలి.
వార్షిక ప్రాతిపదికన 9 శాతం సగటు రాబడి లెక్కన పదేళ్లలో రూ. 1 కోటి కావాలంటే.. నెలనెలా రూ. 51,676 చొప్పున సిప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం పెట్టుబడి రూ. 62.01 లక్షలుగా ఉంది. ఇదే విధంగా 10 శాతం రాబడి లెక్కన సిప్ రూ. 48,817 ఉంటే సరిపోతుంది. ఇక్కడ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ రూ. 58.58 లక్షలుగా ఉంది. 11, 12 శాతం వార్షిక రాబడి చొప్పున చూస్తే వరుసగా రూ. 46083, రూ. 43,471 చొప్పున సిప్ చేస్తే సరిపోతుంది. 13 శాతం వార్షిక రాబడి ఊహిస్తే.. రూ. 42 వేల సిప్ సరిపోతుంది. ఇక్కడ పూర్తి పెట్టుబడి రూ. 50 లక్షలు సరిపోతుంది.