వరుసగా రెండో రోజు లాభాల్లో కి షేర్ మార్కెట్..
- Author : Vamsi Chowdary Korata
Date : 23-01-2026 - 11:20 IST
Published By : Hashtagu Telugu Desk
Indian Stock Markets దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు సానుకూలంగా కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు దేశీయ సెంటిమెంట్‌కు దన్నుగా నిలిచాయి. ఇవాళ ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 132 పాయింట్ల లాభంతో 82,440 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 25,342 వద్ద కొనసాగుతోంది.
- 82,400 పైన సెన్సెక్స్, 25,300 దాటిన నిఫ్టీ
- విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, దేశీయ సంస్థల కొనుగోళ్లు యథాతథం
- వరుసగా రెండో రోజు లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
- లాభాల్లో మెటల్ రంగం, నష్టాల్లో మీడియా షేర్లు
అమెరికా, ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో ఆసియా మార్కెట్లలో ఉత్సాహం కనిపించింది. జపాన్, చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలన్నీ లాభాల్లోనే ఉన్నాయి.
మరోవైపు దేశీయ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) అమ్మకాల ఒత్తిడిని కొనసాగిస్తుండగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) కొనుగోళ్లతో మార్కెట్లకు అండగా నిలుస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఎఫ్ఐఐలు నికరంగా రూ. 2,550 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ. 4,223 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. నిఫ్టీకి 25,100-25,150 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.