Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…
- Author : Vamsi Chowdary Korata
Date : 11-05-2026 - 10:43 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు రేగుతున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఐదు కీలక విజ్ఞప్తులు చేశారు. బంగారం కొనుగోలు చేయొద్దని, విదేశీ ప్రయాణాలకు ఏడాది కాలం దూరంగా ఉండాలని చెప్పారు. అలాగే మెట్రో, ప్రభుత్వ ట్రాన్స్‌పోర్టును మాత్రమే వాడాలని, సొంత వాహనాలను అనవసరంగా రోడ్డు మీదకు తేకూడదని అన్నారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దులకే పరిమితం కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతంగా జీవించడం కూడా ఒక రకమైన దేశ సేవే అని ఆయన పిలుపునిచ్చారు.
ఇరాన్ వివాదం కారణంగా హార్మూజ్ జలసంధి మార్గంలో రవాణా నిలిచిపోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం భారత్‌పై చూపే ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజల కోసం ఆయన ఐదు కీలక విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా బంగారం కొనవద్దని, విదేశీ ప్రయాణాలు చేయవద్దని, మెట్రోనే వాడాలని, ఇంటి దగ్గరే ఉండి పని చేయాలని సూచించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
మెట్రో రైళ్లు, బస్సుల్లోనే వెళ్లాలి..!
పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రజలు వ్యక్తిగత వాహనాల కంటే మెట్రో రైళ్లు, బస్సులు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా ఉపయోగించాలని ప్రధాని సూచించారు. కార్ పూలింగ్ పద్ధతులను అనుసరించాలని, సాధ్యమైనంత వరకు అనవసర ప్రయాణాలను మానుకోవాలని కోరారు. అలాగే వస్తు రవాణాకు రైల్వేలను ఉపయోగించడం వల్ల ఇంధన భారాన్ని తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.
బంగారం కొనుగోళ్లు, విదేశీ పర్యటనలకు స్వస్తి
విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం ప్రస్తుత తరుణంలో అత్యంత ఆవశ్యకమని మోదీ అన్నారు. అందుకే కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు, విదేశాల్లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ను వాయిదా వేసుకోవాలని కుటుంబాలను కోరారు. అదే విధంగా అనవసరంగా బంగారం కొనుగోలు చేయవద్దని, ఇది దిగుమతుల భారాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడుతుందని వివరించారు.
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సంస్కృతి పునరుద్ధరణ”
కరోనా సమయంలో మనం పాటించిన వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగ్స్ వంటి పద్ధతులను మళ్లీ అమల్లోకి తీసుకురావాలని ప్రధాని పిలుపునిచ్చారు. దీనివల్ల ఆఫీసులకు వెళ్లే ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా భారీగా ఇంధనం ఆదా అవుతుందని అన్నారు. ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌ల ద్వారా సమయం, వనరులను ఆదా చేయవచ్చని సూచించారు.
మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ఓటు..
విదేశీ వస్తువుల వ్యామోహాన్ని వీడి, భారత్‌లో తయారైన వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని కోరారు. మనం నిత్యం వాడే బూట్లు, బ్యాగులు, ఇతర ఉపకరణాలు స్వదేశీ కంపెనీలవే కొనుగోలు చేయడం వల్ల దేశీయ పరిశ్రమలు బలపడతాయన్నారు. అంతర్జాతీయ పర్యాటకానికి బదులుగా స్వదేశీ పర్యాటక రంగానికి మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు.
కేవలం పట్టణ ప్రజలే కాకుండా రైతులు కూడా ఈ ఆర్థిక యుద్ధంలో భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వాడకాన్ని 50 శాతం తగ్గించి, డీజిల్ పంపుల స్థానంలో సోలార్ విద్యుత్ పంపులను వాడాలని సూచించారు. “ప్రస్తుత తరుణంలో దేశానికి మనం చేసే అతిపెద్ద సేవ ఆర్థిక క్రమశిక్షణే” అని ప్రధాని స్పష్టం చేశారు. అందరూ ఈ ఐదు సూత్రాలను పాటించి దేశం సంక్షోభంలో కూరుకుపోకుండా చూడాలని పునరుద్ఘాటించారు.