SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు
- Author : Vamsi Chowdary Korata
Date : 20-07-2026 - 4:18 IST
Published By : Hashtagu Telugu Desk
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మరోసారి అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయడం తెలిసిందే. ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి చారిత్రక ఘనతను అందుకుంది. నిన్న జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఆమె జపాన్‌కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి అకనే యమగూచిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో సింధు 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ విజయంతో జపాన్ ఓపెన్ గెలిచిన మొట్టమొదటి భారతీయ షట్లర్‌గా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే, ఈ చారిత్రక విజయం తర్వాత ఆమె సోషల్ మీడియాలో చేసిన ఒక వ్యాఖ్య క్రీడా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సింధు అద్భుత విజయంపై స్పందించిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. “ఇది నిజమైన ఛాంపియన్ కంబ్యాక్. నీ అద్భుత విజయానికి శుభాకాంక్షలు సింధు. దేశం మొత్తం నిన్ను చూసి గర్విస్తోంది” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజమౌళి ప్రశంసలకు సింధు అంతే ఆసక్తికరంగా, చమత్కారంగా స్పందించింది.
రాజమౌళికి ధన్యవాదాలు తెలిపిన సింధు, ఆయన దర్శకత్వంలో రాబోతున్న ‘వారణాసి’ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె రాజమౌళికి ఒక సరదా ఆఫర్ ఇచ్చింది. “భవిష్యత్తులో మీ కథల్లో ఎప్పుడైనా ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పాత్ర అవసరమైతే, ఓ ‘కొత్త నటి’గా మారడానికి నేను సంతోషంగా సిద్ధంగా ఉన్నాను” అంటూ ట్వీట్ చేసింది. ఈ ఊహించని ఆఫర్‌తో సింధు అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం రాజమౌళి, సింధు మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు ఖాయమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. క్రీడా మైదానంలో ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా తన చమత్కారంతో అందరినీ ఆకట్టుకుంటున్న సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.