SBI : ఎస్బీఐ ఆల్ టైమ్ హైకి షేర్ ధర.. రూ. 4 లక్షలొచ్చాయ్.!
- By Vamsi Chowdary Korata Published Date - 12:47 PM, Wed - 19 November 25
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 6 రోజుల లాభాల తర్వాత కిందటి సెషన్లో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ మళ్లీ పుంజుకున్నాయి. ఆరంభంలో మంచి లాభాల్లోనే ఉన్నా.. ఇప్పుడు కాస్త ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు జీవన కాల గరిష్టాల్ని తాకింది. దీంతో ఇన్వెస్టర్లు ఏడాది వ్యవధిలో మంచి లాభాల్ని అందుకున్నారు. పూర్తి వివరాలు చూద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సూచీల వరుసగా 6 రోజుల లాభాలకు.. మంగళవారం సెషన్లో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం రోజు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ఆరంభంలో ఒక దశలో సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా పెరగ్గా.. ఇప్పుడు కాస్త అటుఇటుగా ట్రేడవుతోంది. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో (ఉదయం 11.30 గంటలకు) సెన్సెక్స్ 180 పాయింట్ల లాభంతో 84,850 పైన ట్రేడవుతోంది. నిఫ్టీ చూస్తే 40 పాయింట్లు పెరిగి 25,950 స్థాయిలో కదలాడుతోంది. పలు హెవీ వెయిట్ స్టాక్స్ ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అయినప్పటికీ.. దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ షేర్ ఆల్ టైమ్ గరిష్టాల్ని నమోదు చేసింది. ఇటీవల క్యూ2లో మంచి ఫలితాల్ని కూడా నమోదు చేసింది ఎస్బీఐ.
ఎస్బీఐ స్టాక్ కిందటి సెషన్లో రూ. 972.45 వద్ద ముగియగా.. ఇవాళ అదే ధర దగ్గర ప్రారంభమైంది. మార్కెట్లు ఆరంభంలో ఒడుదొడుకుల్లో ఉండగా.. స్వల్పంగా తగ్గి రూ. 968.80 వద్ద కనిష్టాన్ని తాకింది. తర్వాత మార్కెట్లు పుంజుకోగా మళ్లీ షేర్ ధర స్వల్పంగా పెరిగి రూ. 977.55 వద్ద సెషన్ గరిష్టాన్ని తాకింది. ఇదే ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధరగా ఉంది. ప్రస్తుతం మళ్లీ కాస్త వెనక్కి తగ్గి స్వల్ప లాభంతో రూ. 974 స్థాయిలో కదలాడుతోంది.
ఇక ఎస్బీఐ మార్కెట్ విలువ చూస్తే ప్రస్తుతం రూ. 9 లక్షల కోట్లుగా ఉంది. గత 5 రోజుల్లో ఈ స్టాక్ ధర 2 శాతం వరకు పెరగ్గా.. నెల వ్యవధిలో 8 శాతం పుంజుకుంది. 6 నెలల్లో చూస్తే 23 శాతం పుంజుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కూడా దాదాపు ఇంతే శాతం పెరిగింది. గత ఐదేళ్లలో చూసినట్లయితే ఎస్బీఐ షేర్ ధర 300 శాతానికిపైగా ఎగబాకింది. ఈ క్రమంలో ఐదేళ్ల కిందట ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి రూ. 4 లక్షలకుపైగా వచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండింది.
కొద్ది రోజులుగా ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ కూడా దీనికి కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. ఇందులో భాగంగా.. పలు చిన్న బ్యాంకులు పెద్ద బ్యాంకుల్లో విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎస్బీఐ బ్యాంక్.. విలువ పరంగా మరింత పెద్దదిగా మారబోతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు ఆసక్తితో ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో షేర్ ధర దూసుకెళ్తోంది.