ఎస్బీఐ ఖాతా ఉన్నవారికి బిగ్ షాక్!
ఎస్‌బీఐ సవరించిన ATM, ADWM ఛార్జీలు 1 డిసెంబర్ 2025 నుండే అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం.. ఇతర బ్యాంకుల ATMల నుండి ఉచిత పరిమితి కంటే ఎక్కువసార్లు డబ్బు విత్‌డ్రా చేస్తే 23 రూపాయలు + GST ఛార్జీ పడుతుంది.
- Author : Gopichand
Date : 18-01-2026 - 9:37 IST
Published By : Hashtagu Telugu Desk
SBI: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల లావాదేవీల ఛార్జీలలో మార్పులు చేసింది. మీకు కూడా ఎస్‌బీఐలో ఖాతా ఉన్నట్లయితే ఇది మీకు అవసరమైన వార్త. ఐఎంపీఎస్ (Immediate Payment Service) ద్వారా చేసే ఆన్‌లైన్ లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలు విధిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీనివల్ల చాలా మంది వినియోగదారుల రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రభావం పడవచ్చు. అయితే ఈ ఛార్జీలు కేవలం 25,000 రూపాయల కంటే ఎక్కువ నగదు బదిలీ చేసే లావాదేవీలపై మాత్రమే వర్తిస్తాయి. చిన్న మొత్తంలో చేసే డిజిటల్ పేమెంట్స్ ఎప్పటిలాగే ఉచితంగా ఉంటాయి.
SBI కొత్త IMPS ఛార్జీలు ఎంత?
ఇప్పటివరకు ఎస్‌బీఐ ఖాతా నుండి ఆన్‌లైన్‌లో IMPS ద్వారా నగదు పంపితే ఎటువంటి ఛార్జీలు ఉండేవి కావు. కానీ కొత్త నిబంధన ప్రకారం 25,000 కంటే ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేస్తే సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. లావాదేవీ మొత్తం పెరిగే కొద్దీ ఛార్జీ కూడా మారుతుంది.
- 25,000 నుండి 1 లక్ష రూపాయలు: 2 రూపాయలు + GST
- 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలు: 6 రూపాయలు + GST
- 2 లక్షల నుండి 5 లక్షల రూపాయలు: 10 రూపాయలు + GST
అంటే మీరు పంపే నగదు పెరిగే కొద్దీ ఖర్చు కూడా పెరుగుతుంది. అయితే ఈ ఛార్జీలు చాలా స్వల్పంగానే ఉన్నాయి. ఎస్‌బీఐ ఈ కొత్త ఛార్జీలను 15 ఫిబ్రవరి 2026 నుండి అమలు చేయనుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా YONO యాప్ ద్వారా 25,000 రూపాయల వరకు పంపితే ఎలాంటి ఛార్జీలు ఉండవు.
Also Read: మరోసారి శతక్కొట్టిన విరాట్ కోహ్లీ.. వన్డే కెరీర్‌లో 54వ సెంచరీ!
ఎవరికి మినహాయింపు లభిస్తుంది?
బ్యాంక్ బ్రాంచ్ నుండి నేరుగా చేసే IMPS లావాదేవీల ఛార్జీలలో ఎస్‌బీఐ ఎలాంటి మార్పు చేయలేదు. బ్రాంచ్ ద్వారా చేసే లావాదేవీలకు 2 రూపాయల నుండి 20 రూపాయల వరకు (+GST) ఛార్జీ ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక కేటగిరీ ఖాతాలకు ఈ కొత్త ఫీజుల నుండి మినహాయింపు లభిస్తుంది. వీటిలో DSP, PMSP, ICSP, CGSP, PSP, RSP ఖాతాలతో పాటు శౌర్య ఫ్యామిలీ పెన్షన్ అకౌంట్, SBI రిస్తే ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు ఉన్నారు.
ATM- ADWM ఛార్జీలు కూడా పెంపు
ఎస్‌బీఐ సవరించిన ATM, ADWM ఛార్జీలు 1 డిసెంబర్ 2025 నుండే అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం.. ఇతర బ్యాంకుల ATMల నుండి ఉచిత పరిమితి కంటే ఎక్కువసార్లు డబ్బు విత్‌డ్రా చేస్తే 23 రూపాయలు + GST ఛార్జీ పడుతుంది. శాలరీ అకౌంట్ హోల్డర్లకు నెలకు 10 ఉచిత లావాదేవీలు యథాతథంగా అందుతాయి. కరెంట్ అకౌంట్ హోల్డర్లకు అన్ని ATM లావాదేవీలపై ఛార్జీలు పెంచారు. అయితే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్, ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ హోల్డర్లు లేదా కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాదారులకు ఈ పెంచిన ఛార్జీల నుండి మినహాయింపు ఇచ్చారు.