ముంబైలో కి మై హోమ్ గ్రూప్ .. ₹37,500 కోట్లతో పాన్-ఇండియా పైప్‌లైన్ నిర్మాణం
- Author : Vamsi Chowdary Korata
Date : 21-01-2026 - 2:09 IST
Published By : Hashtagu Telugu Desk
My Home Group Targets ₹37.5K Crore Pipeline in Pan-India Real Estate హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్, వ్యాపార సంస్థల్లో మై హోం గ్రూప్ ఒకటి. ఈ రియల్ ఎస్టేట్ దిగ్గజం ఇప్పుడు జాతీయ స్థాయిలో విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఏకంగా రూ. 37 వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల్ని చేపడుతున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో ఐపీఓకు వచ్చే అవకాశాల్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
- మై హోం గ్రూప్ బిగ్ స్కెచ్
- ముంబై, బెంగళూరు, చెన్నైల్లోనూ వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు
- భవిష్యత్తులో ఐపీఓ కోసం ప్రణాళికలు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని ముద్ర వేసిన మై హోం గ్రూప్ ఇప్పుడు జాతీయ స్థాయిలో తన కార్యకలాపాల్ని విస్తరించనుంది. కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో కొత్త ప్రాజెక్టుల్ని చేపట్టనుంది. ఇప్పుడు ముంబై, బెంగళూరు, చెన్నై ఇలా ప్రముఖ మెట్రో నగరాల్లో భారీ ప్రాజెక్టుల్ని చేపట్టేందుకు రూ. 37,500 కోట్ల భారీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు స్థాపించిన ఈ సంస్థ.. మొదటి నుంచి భాగ్యనగరానికే పరిమితమవుతూ వచ్చింది. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. తమ కార్యకలాపాల విస్తరణ కోసం మై హోం గ్రూప్ ఇప్పటికే రూ. 4,100 కోట్ల మూలధనాన్ని కేటాయించింది.
మై హోం గ్రూప్ హైదరాబాద్ వెలుపల వేస్తున్న మొదటి అడుగు ముంబై మహానగరం. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలైన విలే పార్లే, చెంబూర్‌లో రెండు జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల్ని చేపట్టింది. ప్రధానంగా ఈ ప్రాజెక్టులు ప్రీమియం, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ నివాస సముదాయాలుగా ఉండబోతున్నాయి. గ్రూప్ మొత్తం ప్రాజెక్టుల విలువలో (పైప్‌లైన్) సుమారు 30 శాతం వాటా ముంబైకే కేటాయించింది. ఇక్కడ 2.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టులకు.. రూ. 11,500 కోట్ల వరకు ఆదాయాన్ని ఆశిస్తోంది.
రెండో నగరంగా బెంగళూరును ఎంచుకుంది. ఇక్కడ మై హోం గ్రూప్ తన ఉనికిని బలంగా చాటుతోంది. ఇందుకోసం ఈస్ట్ బెంగళూరులోనే ఏకంగా 76 ఎకరాల భారీ ల్యాండ్ సేకరించింది. ఇక్కడ నివాసాలతో పాటుగా వాణిజ్య, రిటైల్ అవసరాలకు అనుగుణంగా మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ను ప్లాన్ చేస్తోంది. దీని విలువే సుమారుగా రూ. 23 వేల కోట్లుగా అంచనా వేస్తోంది. బెంగళూరులో తమ తొలి ప్రాజెక్టును వచ్చే ఆర్థిక సంవత్సరంలో లాంఛ్ చేయనున్నారు.
ఇక చెన్నై విషయానికి వస్తే ఇక్కడి సిరుసేరి మైక్రో మార్కెట్లో 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో.. జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును మై హోం గ్రూప్ చేపట్టింది. ఇక్కడ రూ. 3 వేల కోట్ల వరకు ఆదాయాన్ని అంచనా వేస్తోంది. మై హోం కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ రాము రావు జూపల్లి దీని గురించి మాట్లాడారు. ‘హైదరాబాద్ నుంచి పాన్ ఇండియా డెవలప్మెంట్ ప్లాట్‌ఫాంగా మారడం మా దీర్ఘకాలిక వ్యూహంలో భాగమే. మాకు ముంబై, బెంగళూరు, చెన్నై మార్కెట్లు కూడా అత్యంత కీలకం.’ అన్నారు. దీంతో రానున్న ఐదేళ్లలో మై హోం గ్రూప్ మొత్తం విక్రయాల్లో.. హైదరాబాదేతర నగరాల వాటానే 40-50 శాతానికి చేరనున్నట్లు తెలిపారు.
ఇదే సందర్భంలో మాట్లాడిన సంస్థ ఎండీ శ్యాంరావు జూపల్లి.. సంస్థ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రస్తుతానికి దృష్టి సారించామని.. భవిష్యత్తులో మూలధన సేకరణ కోసం నిధుల్ని సమీకరించేందుకు ఐపీఓకు వెళ్లడం లేదా ప్రైవేట్ ఫండ్ రైజ్ వంటి అంశాల్ని అప్పటి మార్కెట్ పరిస్థితుల్ని బట్టి పరిశీలిస్తామని చెప్పారు. దీంతో మై హోం గ్రూప్ ఐపీఓకు రాబోతుందన్న సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది.