Mutual Funds : మీ టార్గెట్ రూ.10 కోట్లా? 25, 30, 35, 40..నెలకు ఎంత సిప్ చేయాలి?
- By Vamsi Chowdary Korata Published Date - 10:13 AM, Wed - 26 November 25
మ్యూచువల్ ఫండ్లలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా.. అయితే చాలా చిన్న వయసులోనే చేరిపోవడం బెటర్. అంటే ఇక్కడ మీ ఆర్థిక లక్ష్యాల్ని నెరవేర్చుకోవాలనుకుంటే.. చిన్న వయసులోనే చేరితే తక్కువ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ అందుకోవచ్చు. ఎంత ఆలస్యం చేస్తే.. ఇక్కడ అంత మొత్తం కోల్పోతూనే ఉంటారని చెప్పొచ్చు.
పెట్టుబడులు పెట్టాలని మీకు ఉన్నప్పటికీ.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది తెలియడం లేదా.. దేంట్లో ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తే.. ఎంత రాబడి వస్తుందో తెలుసుకోలేకపోతున్నారా..? అయితే నిపుణులు ప్రధానంగా చెప్పేది ఏంటంటే.. ముందుగా పెట్టుబడి అనేది ఎంతో కొంత మొత్తంతో స్టార్ట్ చేయాలి. రెండోది.. సమయం. అవును.. తగినంత సమయం ఉండటం వల్ల రాబడి పెంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రాబడి అందుకోవచ్చు. ఇంకా ఇక్కడ సిప్ రూపంలో చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేసినప్పటికీ.. నిర్దేశిత సమయంలో మీరు పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ ఫండ్ కూడా సృష్టించుకునేందుకు వీలు పడుతుంది.
మీరు సిప్ ద్వారా స్థిరంగా పెట్టుబడి పెడుతూ పోతే.. వార్షిక ప్రాతిపదికన 12 శాతం చొప్పున రాబడి అందుకున్నట్లయితే అప్పుడు రిటైర్మెంట్ కల్లా మీరు రూ. 10 కోట్లు వెనకేయొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు. అదే ఎంత త్వరగా పెట్టుబడి ప్రారంభిస్తే.. అంత తక్కువ పెట్టుబడి మొత్తం తగ్గుతుంది. అంటే మీరు 25 ఏళ్ల వయసులో పెట్టుబడి ప్రారంభించాలనుకోండి.. అప్పుడు నెలకు సిప్ మొత్తం రూ. 15 వేలు అలా ఉంటే సరిపోతుంది. అదే మీరు 40 ఏళ్ల వయసులో అదే 10 కోట్ల టార్గెట్ కోసం చూస్తే.. ఇక్కడ నెలకు చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ సమయం ఎంత విలువైనదో మనకు అర్థమవుతుంది. ఒక ఐదేళ్లు ఆలస్యంగా ప్రారంభించినా కూడా ఇక్కడ మీ సిప్ మొత్తం ఎన్నో రెట్లు పెరగొచ్చు.
లంప్ సమ్ పెట్టుబడులపైనా ఇదే వర్తిస్తుంది. మీరు 20 ఏళ్ల వయసులో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే 60 ఏళ్లకల్లా.. ఇది రూ. 93 లక్షలకు చేరుతుంది. అదే మొత్తంతో మీరు 40 ఏళ్ల వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే ఇది కేవలం రూ. 9 లక్షలే అవుతుంది. ఇదే మ్యూచువల్ ఫండ్లలో కాంపౌండింగ్ మ్యాజిక్ ఎఫెక్ట్. ఇక్కడ చక్రవడ్డీ ఎఫెక్ట్‌తో.. సంపద కాలం గడుస్తున్న కొద్దీ పెరుగుతుంటుందని గుర్తుంచుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే.. మీరు అన్నేళ్ల సంపద కోల్పోయినట్లే. ఇప్పుడు ఎన్నేళ్ల వయసులో.. పెట్టుబడి ప్రారంభిస్తే.. రిటైర్మెంట్ కల్లా (60 ఏళ్ల వరకు) రూ. 10 కోట్ల టార్గెట్ చేరుకుంటారో చూద్దాం. సగటు వార్షిక రాబడి 12 శాతంగా అంచనా వేద్దాం.
25 ఏళ్ల వయసులోనే చేరితే మరో 35 ఏళ్లకు అంటే 60 ఏళ్లకు (రిటైర్మెంట్) రూ. 10 కోట్లు కావాలంటే.. ఇక్కడ నెలకు సిప్ రూ. 15,396 చొప్పున చేయాల్సి ఉంటుంది.30 ఏళ్లకు ప్రారంభిస్తే.. మరో 30 ఏళ్లలో రూ. 10 కోట్లు అయ్యేందుకు నెలకు రూ. 28,329 చొప్పున సిప్ చేయాలి.35 ఏళ్లలో పెట్టుబడులు ప్రారంభిస్తే గనుక 25 ఏళ్లకు రూ. 10 కోట్లు రావాలంటే.. నెలకు చేయాల్సిన సిప్ మొత్తం రూ. 52,697.40 ఏళ్లకు పెట్టుబడి ప్రారంభిస్తే అప్పుడు మిగతా 20 ఏళ్లలో రూ. 10 కోట్ల టార్గెట్ అందుకునేందుకు నెలకు ఏకంగా రూ. 1,00,085 చొప్పున సిప్ చేయాల్సి ఉంటుంది.
ఇదే లంప్‌సమ్ పెట్టుబడుల విషయానికి వస్తే.. 12 శాతం వార్షిక రాబడి చొప్పున రూ. 1 లక్షను 20 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే.. 60 ఏళ్లకు రూ. 93 లక్షలు వస్తుంది. 25 ఏళ్లలో చేరితే ఇది రూ. 53 లక్షలు అవుతుంది. అదే 30 ఏళ్ల వయసులో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇది రూ. 29 లక్షలుగా మారుతుంది. అదే 40 ఏళ్లకు చేరితే కేవలం రూ. 9 లక్షలే చేతికి వస్తుంది.