New GST: జీఎస్టీలో కీలక మార్పులు.. రూ. 48,000 కోట్లు నష్టం?!
ప్రభుత్వ అంచనాల ప్రకారం 2023-24 నాటి వినియోగ నమూనాల ఆధారంగా ఈ మార్పుల వల్ల ఏటా సుమారు రూ. 48,000 కోట్ల ఆదాయ నష్టం సంభవించవచ్చు. ఈ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాల్సి రావచ్చని రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ వార్తా సంస్థ ఐఏఎన్‌ఎస్‌కు తెలిపారు.
- By Gopichand Published Date - 08:30 PM, Thu - 4 September 25

New GST: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో (New GST) పెద్ద మార్పులు చేసింది. గతంలో ఉన్న నాలుగు స్లాబ్‌లకు బదులుగా ఇప్పుడు కేవలం రెండు స్లాబ్‌లను (5%, 18%) మాత్రమే ఉంచింది. ఈ కొత్త వ్యవస్థ సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తుంది. అయితే, ఈ మార్పుల వల్ల తమ ఆదాయానికి నష్టం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆదాయంపై కేంద్ర ప్రభుత్వ అంచనాలు
ప్రభుత్వ అంచనాల ప్రకారం 2023-24 నాటి వినియోగ నమూనాల ఆధారంగా ఈ మార్పుల వల్ల ఏటా సుమారు రూ. 48,000 కోట్ల ఆదాయ నష్టం సంభవించవచ్చు. ఈ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాల్సి రావచ్చని రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ వార్తా సంస్థ ఐఏఎన్‌ఎస్‌కు తెలిపారు.
Also Read: Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం.. మరో హామీ అమలు!
నష్టంపై బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయం
అయితే బ్రోకరేజ్ సంస్థలు వాస్తవ నష్టం ఇంత ఎక్కువగా ఉండకపోవచ్చని భావిస్తున్నాయి. జీఎస్టీ సంస్కరణల వల్ల డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అవి పేర్కొంటున్నాయి. జెఫరీస్ అంచనా ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ. 22,000 నుంచి రూ. 24,000 కోట్ల మధ్య ఉండవచ్చు. పన్ను తగ్గింపు వల్ల ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుందని, దీనివల్ల రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించవచ్చని ఆ సంస్థ అభిప్రాయపడింది.
బ్రెన్‌స్టీన్ నిపుణుల ప్రకారం.. ప్రభుత్వం మూలధన ఖర్చుల్లో కోత విధించకపోతే ఈ నష్టం కేంద్ర బడ్జెట్‌పై సుమారు 20 బేసిస్ పాయింట్ల భారాన్ని పెంచవచ్చు. కానీ, మూలధన ఖర్చుల్లో 5 శాతం కోత విధిస్తే ఈ ప్రభావం కేవలం 5 బేసిస్ పాయింట్లకు తగ్గుతుంది.
మార్కెట్‌పై ప్రభావం
యూటీఐ ఏఎంసీ ప్రకారం.. ఈ మార్పుల వల్ల బాండ్ మార్కెట్, షేర్ మార్కెట్‌పై ప్రభావం తక్కువగా ఉంటుంది. ఐసీఆర్‌ఏ సంస్థ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అమెరికా అధిక టారిఫ్‌ల ఒత్తిడిని ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఈ సంస్కరణలు సానుకూలంగా ఉంటాయని, మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తాయని పేర్కొంది.