Star Health Vs Telegram : టెలిగ్రాంపై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దావా.. ఎందుకంటే ?
తమ కంపెనీకి చెందిన డాటాను లీక్ చేసి ప్రదర్శిస్తున్న వెబ్‌సైట్లకు క్లౌడ్ ఫేర్ కంపెనీయే హోస్టింగ్ సేవలు అందిస్తోందని పిటిషన్‌లో స్టార్ హెల్త్(Star Health Vs Telegram) పేర్కొంది.
- By Pasha Published Date - 03:48 PM, Thu - 26 September 24

Star Health Vs Telegram : టెలిగ్రాం యాప్‌కు భారత్‌లో షాక్ తగిలింది. టెలిగ్రాంపై మన దేశానికి చెందిన ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మద్రాస్ హైకోర్టులో దావా వేసింది. టెలిగ్రాం వేదికగా తమ కంపెనీకి చెందిన బీమా పాలసీదారుల సమాచారాన్ని హ్యాకర్లు లీక్ చేసినందుకే కోర్టులో దావా వేశామని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ‘‘మా కస్టమర్ల కాన్ఫిడెన్షియల్, పర్సనల్ డాటా టెలిగ్రాం వేదికగా లీకైంది’’ అని కోర్టుకు స్టార్ హెల్త్ తెలిపింది. ఈదావాలో అమెరికా సాఫ్ట్‌వేర్ కంపెనీ క్లౌడ్ ఫేర్‌ను కూడా సహ నిందితుల జాబితాలో చేర్చింది. తమ కంపెనీకి చెందిన డాటాను లీక్ చేసి ప్రదర్శిస్తున్న వెబ్‌సైట్లకు క్లౌడ్ ఫేర్ కంపెనీయే హోస్టింగ్ సేవలు అందిస్తోందని పిటిషన్‌లో స్టార్ హెల్త్(Star Health Vs Telegram) పేర్కొంది.
Also Read :BJP – Reservations : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ వెనుకాడదు.. కాంగ్రెస్ నేత చిదంబరం కామెంట్స్
టెలిగ్రాంపై దావా వేసిన వివరాలతో ప్రముఖ ఆంగ్ల పత్రికలో ఓ ప్రకటనను స్టార్ హెల్త్ కంపెనీ ప్రచురించింది. దీంతో టెలిగ్రాం, క్లౌడ్ ఫేర్ కంపెనీలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు పంపింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 25కు వాయిదావేసింది. షెన్‌జెన్ (xenZen) అనే హ్యాకర్ గ్రూపు ఈ హ్యాకింగ్‌కు పాల్పడి ఉంటుందనే విషయాన్ని తమ పిటిషన్‌లో స్టార్ హెల్త్ ప్రస్తావించింది.
టెలిగ్రాం యూజర్లకు సొంతంగా ఛాట్‌బాట్స్‌ను క్రియేట్ చేసే ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్‌ను వాడుకొని రెండు ఛాట్‌బాట్లను తయారు చేసిన హ్యాకర్లు వాటి ద్వారానే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన కస్టమర్ల సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారు. ఒక ఛాట్‌బాట్‌లో హెల్త్ ఇన్సూరెన్స్‌ల క్లెయిమ్ సమాచారాన్ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో షేర్ చేశారు. ఇంకో ఛాట్‌బాట్‌లో పాలసీ నంబర్, పేరు, శరీర బరువు వంటి వివరాలను ఎంటర్ చేసి ఇష్టం వచ్చిన వారి పాలసీ వివరాలను తెలుసుకునే సదుపాయాన్ని కల్పించారు. తమ వద్ద దాదాపు 3.20 కోట్ల మంది కస్టమర్ల సమాచారం ఉందని రెండో ఛాట్‌బాట్‌లో వెల్లడించడం గమనార్హం. ఆ ఫైళ్లను ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ డౌన్‌లోడ్ చేసుకొని తనిఖీ చేయగా.. వాటిలో స్టార్ హెల్త్ కస్టమర్ల పేరు, ఫోన్ నంబర్, చిరుమానా, పాన్ కార్డు నంబరు, ఐడీ కార్డులు, టెస్టు రిపోర్ట్స్, వైద్య పరీక్షల వివరాలు, రక్త పరీక్షల వివరాలు ఉన్నట్లు తేలింది. టెలిగ్రాం కంపెనీ యజమాని రష్యా దేశస్తుడు. అయితే ఆ కంపెనీ మాత్రం దుబాయ్ వేదికగా కార్యకలాపాలు సాగిస్తోంది. టెలిగ్రాం ఓనర్ పావెల్ దురోవ్ కూడా దుబాయ్‌లోనే నివసిస్తున్నారు.