Rupee Vs Dollar : మన రూపాయి ఎందుకు డీలా పడుతోంది ? అమెరికా డాలరుతో లింకేంటి ?
వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్యాలలో అమెరికా డాలరునే(Rupee Vs Dollar) ప్రామాణికంగా వినియోగిస్తున్నారు.
- By Pasha Published Date - 07:41 PM, Sat - 21 December 24

Rupee Vs Dollar : భారత రూపాయి పతనం ఎంతకూ ఆగడం లేదు. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ క్రమంగా డౌన్ అవుతూ ఇటీవలే రూ.85కు చేరింది. అంటే ఒక అమెరికా డాలరు కోసం మనం 85 రూపాయల్ని ఇవ్వాల్సి వస్తోందన్న మాట. పరిస్థితులు అమెరికా డాలరుకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని, దానిదే పైచేయిగా ఉందని ఈ లెక్కలను బట్టి స్పష్టమవుతోంది. ఒక డాలరు కోసం మనం రూ.85 చెల్లించాల్సి రావడం అనేది జీవిత కాల కనిష్ఠ స్థాయి. ఇంతకుముందు ఎన్నడూ ఈ రేటును మనం చెల్లించనే లేదు. నరేంద్రమోడీ 2014 సంవత్సరంలో మనదేశ ప్రధానమంత్రి అయిన టైంలో అమెరికా డాలరుతో భారత రూపాయి మారకం విలువ రూ.61 వద్ద ఉంది. గత పదేళ్లలో ఏకంగా 24 రూపాయల మేర మన రూపాయి పతనమైంది. మనం ఒక అమెరికా డాలరు కోసం ఎక్స్‌ట్రా 24 రూపాయలు (రూ.61 + రూ.24) చెల్లించాల్సి వస్తోంది.
Also Read :GST Council Meeting: పాత కార్లు, పాప్ కార్న్, రెడీమేడ్ దుస్తులపై ‘కౌన్సిల్’ కీలక చర్చలు
డాలరును మన దేశం ఎందుకు వాడుతుంది ?
- అసలు అమెరికా డాలరుతో మనకేం పని ఉందని చాలామంది భావిస్తుంటారు.
- వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్యాలలో అమెరికా డాలరునే(Rupee Vs Dollar) ప్రామాణికంగా వినియోగిస్తున్నారు. చాలా దేశాలు అమెరికా డాలరుతోనే ఎగుమతులు, దిగుమతులు చేస్తున్నాయి. అందుకే ప్రపంచంలో ఏ దేశ కరెన్సీకి కూడా లేనంత విలువ అమెరికా డాలరుకు వచ్చింది.
- మన భారతదేశం విదేశాల నుంచి ముడి చమురు (పెట్రోలు, డీజిల్)ను దిగుమతి చేసుకొని అమెరికా డాలర్ల రూపంలో భారీగా చెల్లింపులు చేస్తుంటుంది.
- ఈ డాలర్లను నేరుగా అమెరికా సెంట్రల్ బ్యాంకు నుంచి భారతదేశ రిజర్వ్ బ్యాంక్ తీసుకొని నిల్వ చేస్తుంటుంది. దేశంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు బ్యాంకుల ద్వారా ఆ డాలర్లను రిజర్వ్ బ్యాంకు సమకూరుస్తుంటుంది.
- డాలర్లను పొందేందుకుగానూ మన దేశం పెద్దమొత్తంలో రూపాయలను అమెరికా సెంట్రల్ బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక డాలరుకు రూ.85 చొప్పున వాళ్లకు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మన దేశ కరెన్సీ విలువ ఎప్పుడూ అమెరికా డాలరు కంటే బలహీనంగానే ఉంటోంది.
- కరెన్సీ కూడా ఒక కమొడిటీ (సరుకు) లాంటిదే. కరెన్సీ మార్కెట్‌లో రోజూ అంతర్జాతీయ స్థాయిలో ట్రేడింగ్ జరుగుతుంటుంది. అందులో ప్రపంచంలోని టాప్ ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, అపర కుబేరులు, ప్రభుత్వాల సెంట్రల్ బ్యాంకులు పాల్గొంటాయి.
- అంతర్జాతీయ పరిణామాలు, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలలో చోటుచేసుకునే మార్పుల ఆధారంగా కరెన్సీ మార్కెట్‌లు రోజూ ప్రభావితం అవుతుంటాయి. అవి ఒకసారి పాజిటివ్‌గా, మరోసారి నెగెటివ్‌గా ప్రభావితం అవుతాయి. పాజిటివ్‌గా ప్రభావితం అయినప్పుడు కరెన్సీ బలోపేతం అవుతుంది. నెగెటివ్‌గా ప్రభావితం అయితే కరెన్సీ బలహీనపడుతుంది.
- భారత కరెన్సీ ఇటీవల కాలంలో బలహీనపడటానికి కారణం నెగెటివ్ అంశాల ప్రభావం. అమెరికా కేంద్ర బ్యాంకు నిర్ణయాలు, భారత ఆర్థిక వ్యవస్థలోని బలహీనతలు కలిసి మన రూపాయిని డీలాపడేలా చేశాయి.
Also Read :WhatsApp Vs Pegasus : ఆ దుశ్చర్య ఇజ్రాయెల్ కంపెనీదే.. భారత్ సహా ఎన్నోదేశాల వాట్సాప్ యూజర్లపై నిఘా
మనదేశంలోకి డాలర్ ప్రవాహం..
- చాలామంది అమెరికా సంపన్నులు భారత స్టాక్ మార్కెట్‌లో, భారత కంపెనీలలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతుంటారు. ఆ పెట్టుబడులన్నీ అమెరికా డాలర్ల రూపంలో మన దేశానికి వస్తాయి. ఈవిధంగా ఎంత ఎక్కువగా అమెరికా డాలర్లు మనదేశంలోకి వస్తే.. మన రూపాయి అంతగా స్ట్రాంగ్ అవుతుంది. అమెరికా డాలర్లతో మనదేశ ఖజానా ఎంతగా నిండితే.. మన రూపాయి అంతగా బలోపేతం అవుతుంది.
- ఒకవేళ భారత్ నుంచి దిగుమతులను అనుమతించము అని అమెరికా ప్రకటించింది అనుకుందాం.. అలా జరిగితే.. భారత రూపాయి దారుణంగా దెబ్బతింటుంది. ఎందుకంటే మన దేశ దిగుమతులు అమెరికాకు చేరితే.. అక్కడి నుంచి మనకు డాలర్లు వస్తాయి. అవి రావడం ఆగిపోతే.. మన దేశంలోని విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ఫలితంగా రూపాయి డీలా పడుతుంది.