Russian Oil Supplies: గయానా నుంచి చమురు దిగుమతులు.. 17,700 కి.మీ సుదీర్ఘ ప్రయాణం!
ట్రాకింగ్ డేటా ప్రకారం.. 2021 తర్వాత గయానా నుంచి భారతదేశానికి ఇది మొట్టమొదటి క్రూడ్ షిప్‌మెంట్. అంతకుముందు కూడా 1 మిలియన్ బారెల్స్ క్రూడ్ ఆయిల్‌తో రెండు కార్గోలు పంపబడ్డాయి.
- By Gopichand Published Date - 09:22 PM, Mon - 1 December 25
Russian Oil Supplies: రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినప్పటి నుంచి చమురు దిగుమతుల (Russian Oil Supplies) విషయంలో భారతదేశానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో భారత్ ఇప్పుడు సుదూర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కొనాల్సి వస్తోంది. బ్లూమ్‌బెర్గ్ షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. భారత్ ప్రస్తుతం దక్షిణ అమెరికా దేశమైన గయానా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. చమురును తీసుకురావడానికి భారతీయ ట్యాంకర్లు దాదాపు 11,000 మైళ్ల (సుమారు 17,700 కిలోమీటర్లు) సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి వస్తోంది.
నివేదిక ప్రకారం.. రెండు పెద్ద క్రూడ్ క్యారియర్‌లు కోబాల్ట్ నోవా, ఒలింపిక్ లయన్ నవంబర్ చివరి రోజుల్లో గయానా నుంచి బయలుదేరాయి. ఒక్కొక్కటి దాదాపు 2 మిలియన్ బారెల్స్ చమురుతో నిండిన ఈ ట్యాంకర్లు జనవరిలో భారతదేశానికి చేరుకోవచ్చని అంచనా.
రష్యా స్థానంలో ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ
ట్రాకింగ్ డేటా ప్రకారం.. 2021 తర్వాత గయానా నుంచి భారతదేశానికి ఇది మొట్టమొదటి క్రూడ్ షిప్‌మెంట్. అంతకుముందు కూడా 1 మిలియన్ బారెల్స్ క్రూడ్ ఆయిల్‌తో రెండు కార్గోలు పంపబడ్డాయి. భారత్ గతంలో రోజుకు సుమారు 1.7 మిలియన్ బారెల్స్ రష్యన్ చమురును దిగుమతి చేసుకునేది. అయితే గత నెలలో రష్యాలోని అతిపెద్ద ఎగుమతిదారులు రోస్‌నెఫ్ట్ PJSC, లుకోయిల్ PJSCలపై అమెరికా విధించిన ఆంక్షలు భారతీయ రిఫైనరీలకు ఆందోళన కలిగించాయి.
Also Read: Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌గా స్టార్ ప్లేయర్!
తగ్గింపు ధరతో ఆదా
భారత్ ప్రపంచంలోనే ముడి చమురును కొనుగోలు చేసే మూడవ అతిపెద్ద దేశం. గతేడాది రష్యా నుంచి 52.7 బిలియన్ డాలర్ల విలువైన ముడి చమురును భారత్ కొనుగోలు చేసింది. భారత్ రష్యా కాకుండా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, నైజీరియా, అమెరికా నుంచి కూడా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా భారత్‌కు రష్యా నుంచి ముడి చమురు తగ్గింపు ధరలకు లభించింది. 2022-23లో రష్యన్ చమురుపై భారత్‌కు సగటున 14.1%, 2023-24లో 10.4% వరకు తగ్గింపు లభించింది. దీని వలన భారత్‌కు సుమారు 5 బిలియన్ డాలర్ల వరకు ఆదా అయ్యింది.
చమురు ట్యాంకర్ల గమ్యస్థానం
ఒలింపిక్ లయన్: ఈ ట్యాంకర్ గయానా గోల్డెన్ యారోహెడ్ క్రూడ్‌ను తీసుకొని, భారత్ తూర్పు తీరంలో ఉన్న పారాదీప్‌కు వెళుతోంది. ఇక్కడ ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) రిఫైనరీని నిర్వహిస్తోంది.
కోబాల్ట్ నోవా: ఈ ట్యాంకర్‌లో లిజా, యూనిటీ గోల్డ్ గ్రేడ్ల మిశ్రమ కార్గో ఉంది. ఇది బహుశా ముంబై లేదా విశాఖపట్నంలో దించే అవకాశం ఉంది. ఇక్కడ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) ప్లాంట్లను నిర్వహిస్తోంది.