GST : విమాన ప్రయాణాలపై ప్రభావం: ప్రీమియం టికెట్లపై 18% జీఎస్టీ?
ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% శ్లాబులు అమలులో ఉన్నప్పటికీ, ఈ విధానం క్లిష్టతను సృష్టిస్తోంది. వినియోగదారులకు బోధ్యం కావడంలో కష్టతరంగా మారిందని, వ్యాపార వర్గాలు కూడా ఒకే విధమైన సరళమైన పన్ను వ్యవస్థ కోసం నిరంతరం విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.
- By Latha Suma Published Date - 12:33 PM, Fri - 29 August 25

GST : వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో విస్తృత మార్పులకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబుల స్థానంలో ఇకపై కేవలం రెండు శ్లాబులు (5 శాతం, 18 శాతం) మాత్రమే కొనసాగనున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వినియోగదారులపై ప్రభావం చూపే ఈ నిర్ణయం, సెప్టెంబర్‌లో జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అధికారికంగా ఆమోదం పొందే అవకాశముంది. ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% శ్లాబులు అమలులో ఉన్నప్పటికీ, ఈ విధానం క్లిష్టతను సృష్టిస్తోంది. వినియోగదారులకు బోధ్యం కావడంలో కష్టతరంగా మారిందని, వ్యాపార వర్గాలు కూడా ఒకే విధమైన సరళమైన పన్ను వ్యవస్థ కోసం నిరంతరం విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.
నూతన మార్పుల ప్రకారం, ప్రీమియం ఎకానమీ, బిజినెస్, ఫస్ట్ క్లాస్ విమాన టికెట్లపై ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ వసూలు అవుతోంది. కానీ, త్వరలో ఈ రేటు 18 శాతానికి పెరిగే అవకాశం ఉంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ తరహా ప్రయాణాలు సాధారణంగా వ్యాపార అవసరాల కోసమే జరిగే కారణంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) వర్తించేలా కేంద్రం యోచనలో ఉంది. అంటే, వ్యాపార అవసరాలకు ఉపయోగించే టికెట్లపై చెల్లించిన జీఎస్టీని వ్యాపార సంస్థలు తమ అమ్మకాలపై చెల్లించే పన్నులో నుండి సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. అయితే, ఎకానమీ క్లాస్ టికెట్లపై యధావిధిగా 5 శాతం జీఎస్టీ కొనసాగనుంది. ఈ తరహా ప్రయాణాలకు సాధారణంగా ITC వర్తించదు.
బ్యూటీ, వెల్‌నెస్ సేవలపై పన్ను తగ్గింపు ప్రతిపాదన
ఇంకా ఒక ప్రధాన ప్రతిపాదనగా బ్యూటీ మరియు వెల్‌నెస్ సేవలపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించాలన్న సూచనలు ఉన్నాయి. అయితే, ఈ సేవలకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తించదని భావిస్తున్నారు. ఇది చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపనుండగా, వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.
సినిమా టికెట్లపై పన్ను తగ్గింపు
జనప్రియ వినోద రంగమైన సినిమా టికెట్లపై కూడా సానుకూల మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం రూ.100లోపు ధర ఉన్న టికెట్లపై 12 శాతం జీఎస్టీ విధించబడుతోంది. అయితే, ITC ప్రయోజనాన్ని కల్పిస్తూ, దీనిని 5 శాతానికి తగ్గించాలన్న సిఫారసులు ఉన్నట్లు తెలుస్తోంది.
దీపావళి నాటికి ధరల తగ్గింపు హామీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం, నిత్యవసర వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించి, దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు తీపి కానుక ఇవ్వనున్నట్టు చెప్పారు. దీని ప్రకారం, అత్యవసర వస్తువులు, రోజూ వినియోగించే వస్తువులపై తగ్గిన రేట్లు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
జీఎస్టీ కౌన్సిల్ కీలక సమావేశం సెప్టెంబర్‌లో
జీఎస్టీ శ్లాబుల సరళీకరణ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి వచ్చే నెల 3, 4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో, తాజా ప్రతిపాదనలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మంత్రుల బృందం ఆమోదం
ఇప్పటికే జీఎస్టీ శ్లాబులను రెండు (5%, 18%) వరకు పరిమితం చేయాలన్న ప్రతిపాదనకు మంత్రుల బృందం (GoM) ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో, పన్ను విధానం మరింత పారదర్శకంగా మారే అవకాశముంది. వ్యాపార వర్గాలు కూడా తమ ఖర్చులను సులభంగా గణించుకునే వీలుండనుంది.